సల్మాన్ ఖాన్‌కు అరుదైన గౌరవం
► రియో ఒలింపిక్స్‌లో భారత బృందానికి
► గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియామకం
న్యూఢిల్లీ: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు అరుదైన గౌరవం దక్కింది. రియో ఒలింపిక్స్ గుడ్ విల్ అంబాసిడర్‌గా సల్మాన్ ఎంపికయ్యాడు. శనివారం భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. మొదట ఈ పదవి కోసం షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్ పేర్లను పరిశీలించిన అధికారులు... యువతలో ఉన్న ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకుని సల్మాన్‌ను ఎంపిక చేసిన ట్లు తెలిపారు. సల్మాన్ తాజాగా ‘సుల్తాన్’ అనే చిత్రంలో రెజ్లర్‌గా నటించి మన్ననలు పొందాడు. కాగా ఒక బాలీవుడ్ సూపర్ స్టార్ ఒలింపిక్స్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా వ్యవహరించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
ఒలింపిక్స్‌లో తమతో సల్మాన్ ఖాన్ చేరడం పట్ల క్రీడాకారులు మేరీకామ్, సర్దార్ సింగ్, రీతూ రాణిలు హర్షం వ్యక్తం చేశారు. ‘గుడ్ విల్ అంబాసిడర్‌గా ఎంపికవడం చాలా గర్వంగా ఉంది. క్రికెట్‌లానే ఒలింపిక్ క్రీడాంశాలను అందరూ ప్రోత్సహించాలి. నేను రియోకి వెళ్లి మరీ మన క్రీడాకారుల ఆటను ఆస్వాదిస్తాను’ అని సల్మాన్ పేర్కొన్నాడు. ఆటగాళ్లను ఉద్దేశించి మాట్లాడుతూ రియో నుంచి మాకోసం తప్పకుండా ఏదైనా తీసుకురండి (కుచ్ న కుచ్ జరూర్ లేఖే ఆనా) అంటూ ప్రోత్సహించారు. రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత క్రీడాకారులందరికీ రూ. కోటి చొప్పున ఎడెల్‌వీస్ సంస్థ బీమా సౌకర్యం కల్పించింది.