చరిత్ర సృష్టించిన సంధూ
న్యూఢిల్లీ: ఈస్ట్ బెంగాల్ మాజీ గోల్ కీపర్ గుర్‌ప్రీత్ సింగ్ సంధూ భారత ఫుట్‌బాల్‌లో కొత్త చరిత్ర సృష్టించాడు. 79 ఏళ్ల తర్వాత తొలి అంచె యూరోపియన్ క్లబ్‌లో ఆడిన భారత ఆటగాడిగా తను రికార్డులకెక్కాడు. 2014 ఆగస్టులో సంధూ.. నార్వేయన్ టిప్పెలిగేన్ క్లబ్‌లో ఆడే స్టాబేక్ ఎఫ్‌సీ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
గత శనివారం ఫోలో ఫుట్‌బాల్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 22 ఏళ్ల సంధూ తొలిసారిగా బరిలోకి దిగాడు. సంధూకన్నా ముందు భారత్ నుంచి యూరప్ లీగ్‌ల్లో మొహమ్మద్ సలీం, బైచుంగ్ భూటియా, సునీల్ చెత్రి, సుబ్రతా పాల్ ఆడారు. అయితే టాప్ డివిజన్ క్లబ్‌లో సలీం మాత్రమే ఆడాడు. ఆయన 1936లో సెల్టిక్ తరఫున బరిలోకి దిగాడు.