గెలుస్తామనుకోలేదు: మాథ్యూస్
లండన్: భారత్‌పై దూకుడుగా ఆడాలని తమ మాజీ కెప్టెన్ కుమార సంగక్కర చేసిన సూచనలే గెలుపుకు కారణమయ్యాయని ఆ జట్టు కెప్టెన్ ఎంజెలో మాథ్యూస్ అభిప్రాయపడ్డాడు. గురువారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 7 వికెట్ల తేడాతో సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన మాథ్యూస్ ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగామని, ఈ విజయం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నాడు. ఒత్తిడిలో ఉన్న మేము భారత్‌తో మ్యాచ్ గెలుస్తామనుకోలేదన్నాడు. కానీ సాయశక్తుల పోరాడాలని, స్వేచ్ఛగా ఆడాలని నిర్ణయించుకున్నట్లు మాథ్యూస్ తెలిపాడు. గత కొద్దీ కాలముగా విజయాలు లేని మాకు ఈ విజయం ఊరటనిచ్చిందన్నాడు.
మ్యాచ్‌కు రెండు రోజుల ముందు సంగక్కర యువ ఆటగాళ్లకు బ్యాటింగ్‌లో మెళుకవలు సూచించాడని, వాటిని యువ ఆటగాళ్లు అమలుపరిచారని అదే గెలుపుకు కారణమైందని మాథ్యూస్ తెలిపాడు. కుసాల్ మెండీస్(89) రాణించడానికి సంగక్కర బ్యాటింగ్ సూచనలే కారణమన్నాడు. మెండీస్, గుణతిలకాల 159 పరుగుల భాగస్వామ్యం కీలకమని ఈ యువ ఆటగాళ్లను కొనియాడాడు. స్వేచ్ఛగా దూకుడుగా ఆడామని అదే గెలిపించిందని అభిప్రాయపడ్డాడు.
తొడ నరాలు పట్టుకొని బాధపడుతున్న కుసాల్ పెరారా(47)ను కెప్టెన్‌గా రిటైర్డ్ హాట్‌గా పంపిచానని, ఆసమయంలో ఫలితం గురించి ఆలోచించలేదన్నాడు. ఫలితం వేరేలా ఉంటే నాపై విమర్శలు వస్తాయని తెలుసని, కానీ కఠిన పరిస్థితుల్లో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని మాథ్యూస్ అభిప్రాయపడ్డాడు. ఈ గెలుపుతో సెమీస్ రేసులో ఉన్నామని, తర్వాతి మ్యాచ్‌కు కూడా ఇదే ప్రణాళిక అమలు చేస్తామన్నాడు. గెలుపుపై ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగుతామని మాథ్యూస్ పేర్కొన్నాడు.