
క్వార్టర్స్‌లో సానియా-బోపన్న జంట
టెన్నిస్ ఈవెంట్ మిక్స్‌డ్ డబుల్స్‌లో నాలుగో సీడ్ సానియా మీర్జా-రోహన్ బోపన్న (భారత్) జంట శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన తొలి రౌండ్‌లో సానియా-బోపన్న ద్వయం 7-5, 6-4తో సమంత స్టోసుర్-జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా) జోడీపై విజయం సాధించింది. 73 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి ఎనిమిది గేమ్‌ల వరకు రెండు జంటలూ తమ సర్వీస్‌ను నిలబెట్టుకున్నాయి. తొమ్మిదో గేమ్‌లో పీర్స్ సర్వీస్‌ను భారత జోడీ బ్రేక్ చేసి 5-4తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే బోపన్న పదో గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకోవడంలో విఫలం కావడంతో స్కోరు 5-5తో సమమైంది. కానీ 11వ గేమ్‌లో స్టోసుర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన సానియా-బోపన్న ఆ తర్వాత తమ సర్వీస్‌ను కాపాడుకొని సెట్‌ను దక్కించుకున్నారు.
రెండో సెట్‌లో ఒకసారి ఆసీస్ జంట సర్వీస్‌ను బ్రేక్ చేసిన భారత జోడీ 4-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. పదో గేమ్‌లో బోపన్న మూడు ఏస్‌లు సంధించి విజయాన్ని ఖాయం చేశాడు. మ్యాచ్ మొత్తంలో భారత జోడీ ఏడు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. క్వార్టర్ ఫైనల్లో ఆండీ ముర్రే-హీతెర్ వాట్సన్ (బ్రిటన్) జంటతో సానియా-బోపన్న తలపడతారు.