
న్యూఢిల్లీ: త్వరలో తల్లి కాబోతున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకానికి దూరమైంది. భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) బుధవారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఆమెతో పాటు ఐదుగురు రెజ్లర్లు, ఇద్దరు బాక్సర్లు కూడా ఈ జాబితాలో చోటు కోల్పోయారు. కొత్తగా ఇద్దరు ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు ఎ. ధరుణ్, మోహన్ కుమార్ ‘టాప్’ ద్వారా లబ్ధి పొందనున్నారు. రెజ్లర్లు ప్రవీణ్ రాణా, సత్యవర్త్ కడియన్, సుమిత్, లలిత, సరిత... బాక్సర్లు ఎల్. దేవేంద్రో సింగ్, ఎస్. సర్జుబాలా దేవిలను ‘టాప్’ జాబితా నుంచి సాయ్ తొలిగించింది.
వచ్చే ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని పతకం సాధించే అవకాశాలున్న క్రీడాకారులకు ప్రత్యేకంగా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ‘టాప్’ ద్వారా ప్రోత్సాహాన్ని అందిస్తోంది. ప్రస్తుతం 192 మంది ఈ పథకంలో ఉన్నారు. వీరిలో 41 మంది మాత్రమే టోక్యో ఒలింపిక్స్ గేమ్స్ వరకు ఇందులో కొనసాగుతారు. మిగతా వారికి ఆసియా క్రీడల వరకే ఈ పథకం వర్తిస్తుంది. ఆటగాళ్ల ప్రదర్శనల ఆధారంగా కొత్త ఆటగాళ్లకు చోటు కల్పించడంతో పాటు, పురోగతి లేని క్రీడాకారులకు ఉద్వాసన కూడా పలుకుతారు.
Comments
Please login to add a commentAdd a comment