
సెమీస్ కు సానియా -హింగిస్ జోడి
ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్ విభాగంగా సానియా మీర్జా(భారత్)-మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్) జోడి సెమీ ఫైనల్ కు చేరింది.
మెల్ బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్ విభాగంలో సానియా మీర్జా(భారత్)-మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్) జోడి సెమీ ఫైనల్ కు చేరింది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో సానియా జోడి 6-2,4-6, 6-1 తేడాతో గ్రోనిఫెల్డ్-కోకో వేన్ద్వెగి ద్వయంపై గెలిచి సెమీస్ కు చేరింది. తొలి సెట్ ను అవలీలగా గెలిచిన ఈ జోడి.. రెండో గేమ్ లో మాత్రం ఓటమి పాలైంది. కాగా, నిర్ణయాత్మక మూడో సెట్ లో తిరిగి పుంజుకున్న సానియా జంట వరుస పాయింట్లను సాధించి ఆ గేమ్ ను కైవసం చేసుకుంది. దీంతో తమ వరుస విజయాల సంఖ్యను 34 కు పెంచుకుంది.
ఇదిలా ఉండగా మిక్సడ్ డబుల్స్ లో సానియా మీర్జా-ఇవాన్ డోడిగ్ జంట మూడో రౌండ్ కు చేరింది. రెండో రౌండ్ లో ఈ జంట 7-5, 6-2 తేడాతో ఐసమ్ ఉల్ హక్ ఖరేషి- యరోస్లావా ష్వెదోవా ద్వయంపై విజయం సాధించింది. మరో మిక్సడ్ డబుల్స్ లో లియాండర్ పేస్-మార్టినా హింగిస్ జోడి 6-1,6-2 తేడాతో జులెన్ రో్జర్- స్లోన్ స్టెఫెన్స్ జంటపై విజయం సాధించి మూడో రౌండ్ కు చేరింది.