సాన్ టినా ఎక్స్ ప్రెస్ | Sania Mirza, Martina Hingis Advance to Sydney International Final | Sakshi
Sakshi News home page

సాన్ టినా ఎక్స్ ప్రెస్

Published Thu, Jan 14 2016 11:57 PM | Last Updated on Sun, Sep 3 2017 3:41 PM

సాన్ టినా ఎక్స్ ప్రెస్

సాన్ టినా ఎక్స్ ప్రెస్

వరుసగా 29 మ్యాచ్‌లు గెలిచిన సానియా-హింగిస్
1994 తర్వాత అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన జోడీగా గుర్తింపు
సిడ్నీ ఓపెన్ ఫైనల్లో ఇండో-స్విస్ ద్వయం

 
 అంతర్జాతీయ యవనికపై అప్రతిహత జైత్రయాత్ర కొనసాగిస్తున్న సానియా-హింగిస్ జోడీ డబ్ల్యూటీఏ సర్క్యూట్‌లో 22 ఏళ్ల చరిత్రను తిరగరాసింది. వరుసగా 29 మ్యాచ్‌ల్లో గెలిచి 1994 తర్వాత ఈ ఘనత సాధించిన తొలి మహిళా జోడీగా రికార్డులకెక్కింది.
 
 లక్ష్యం పెద్దదే...
 ప్రస్తుతానికి సానియా-హింగిస్‌లు 1994 తర్వాత వరుసగా ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన రికార్డును మాత్రమే అందుకున్నారు. 1990లో జానా నవోత్నా-ఎలీనా సుకోవా నెలకొల్పిన 44 మ్యాచ్‌ల రికార్డును ఛేదించాలంటే సానియా జోడి ఇంకా 16 మ్యాచ్‌లు గెలవాలి. మహిళల డబుల్స్‌లో ప్రపంచ రికార్డు లక్ష్యం మాత్రం చాలా పెద్దగా ఉంది. 1983-85 మధ్య కాలంలో మార్టినా నవ్రత్తిలోవా-ఫామ్ ష్రివర్‌లు వరుసగా 109 మ్యాచ్‌ల్లో నెగ్గారు.
 
 సిడ్నీ: అవకాశం వచ్చిన ప్రతిసారి తమ రాకెట్ నైపుణ్యాన్ని చూపెడుతున్న సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)లు మహిళల డబుల్స్‌లో 22 ఏళ్ల చరిత్రను తిరగరాశారు. వరుసగా 29 మ్యాచ్‌ల్లో గెలిచి... 1994 తర్వాత అత్యధిక మ్యాచ్‌లు నెగ్గిన మహిళా జోడీగా రికార్డులకెక్కారు. సిడ్నీ ఓపెన్ ఫైనల్లోకి చేరుకోవడం ద్వారా ఇండో-స్విస్ ద్వయం ఈ ఘనత సాధించింది. దీంతో 1994లో గిగీ ఫెర్నాండేజ్ (ప్యూర్టోరికా-అమెరికా)-నటాషా జ్వెరెవా (బెలారస్) నెలకొల్పిన 28 విజయాల రికార్డు ఈ సందర్భంగా తుడిచిపెట్టుకుపోయింది.
 
 సిడ్నీ ఓపెన్‌లో భాగంగా గురువారం జరిగిన మహిళల డబుల్స్ సెమీస్‌లో ప్రపంచ నంబర్‌వన్ సానియా-హింగిస్ 4-6, 6-3, 10-8తో రాలుకా ఒలారు (రొమేనియా)-యారోస్లావా ష్వెదోవా (కజకిస్తాన్)లపై నెగ్గారు. గతేడాది వింబుల్డన్, యూఎస్ ఓపెన్, డబ్ల్యూటీఏ ఫైనల్స్‌తో కలిపి సానియా-హింగిస్ మొత్తం 9 టైటిల్స్ గెలిచారు. గతవారం బ్రిస్బేన్ టైటిల్ నెగ్గిన ఈ జంటకు ఇది రెండో ఫైనల్. గంటా 31 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థుల నుంచి ప్రతిఘటన ఎదురైనా... ఇండో-స్విస్ జోడి దీటుగా స్పందించింది.
 
  తొలి సెట్‌లో రెండు జంటలు చెరో మూడుసార్లు బ్రేక్ పాయింట్లను కాపాడుకున్నాయి. అయితే ఒలారు-ష్వెదోవా నాలుగో బ్రేక్ పాయింట్‌ను కాచుకుని 6-4తో సెట్‌ను కైవసం చేసుకుంది. రెండో సెట్‌లో వ్యూహం మార్చిన సానియా-హింగిస్.... ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేయడంతో పాటు తమ సర్వీస్‌లను కాపాడుకున్నారు. తొలి సర్వీస్‌లోనే 76 శాతం పాయింట్లను సాధించారు. నిర్ణయాత్మక మూడో సెట్‌లో రెండు జోడీలు తమ సర్వీస్ పాయింట్లను నిలబెట్టుకున్నా... కీలక దశలో ఒలారు-ష్వెదోవా డబుల్ ఫాల్ట్ చేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. దీన్ని ఆసరా చేసుకున్న సానియా వరుస పాయింట్లతో సెట్‌తో పాటు మ్యాచ్‌ను చేజిక్కించుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement