‘ఖేల్ రత్న’ లాంఛనమే | Sania to the highest sporting honor | Sakshi
Sakshi News home page

‘ఖేల్ రత్న’ లాంఛనమే

Published Wed, Aug 12 2015 12:14 AM | Last Updated on Sun, Sep 3 2017 7:14 AM

‘ఖేల్ రత్న’ లాంఛనమే

‘ఖేల్ రత్న’ లాంఛనమే

సానియాకు అత్యున్నత క్రీడా పురస్కారం
♦ శ్రీకాంత్, అనూప్‌లకు ‘అర్జున’
♦ రోహిత్ సహా  మరో 15 మందికి కూడా...
♦ క్రీడాశాఖకు ప్రతిపాదించిన అవార్డుల కమిటీ
 
 న్యూఢిల్లీ : దేశం గర్వించదగ్గ విజయాలు సాధించిన టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్‌గాంధీ ఖేల్త్న్ర’ పురస్కారానికి ఎంపికైంది. బ్యాడ్మింటన్ రైజింగ్ స్టార్ కిడాంబి శ్రీకాంత్, రోలర్ స్కేటింగ్ ప్లేయర్ అనూప్ కుమార్ యామా ప్రతిష్టాత్మక ‘అర్జున’ అవార్డులను దక్కించుకున్నారు. ఈ మేరకు పురస్కారాల కమిటీ వీళ్ల పేర్లను కేంద్ర క్రీడాశాఖకు సిఫారసు చేసింది. ఇక క్రీడాశాఖ అధికారికంగా ప్రకటించడం లాంఛనమే కానుంది. జాబితాను ఆమోదించిన తర్వాత ఈనెల 29న జాతీయ క్రీడా దినోత్సవం రోజున ఆటగాళ్లకు ఈ అవార్డులను అందజేస్తారు. క్రికెటర్ రోహిత్ శర్మతో పాటు మరో 14 మందిని కూడా అర్జున అవార్డుకు ప్రతిపాదించారు.

  ఖేల్త్న్ర అవార్డు దక్కించుకోబోతున్న రెండో టెన్నిస్ ప్లేయర్ సానియా. అట్లాంటా ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన లియాండర్ పేస్... 1996లో ఈ పురస్కారాన్ని అందుకున్నాడు. దీపికా పల్లికల్ (స్క్వాష్), వికాస్ గౌడ (డిస్కస్ త్రోయర్), టింటూ లూకా (ట్రాక్ అండ్ ఫీల్డ్), పి.వి.సింధు (బ్యాడ్మింటన్), సర్దార్ సింగ్ (హాకీ)ల నుంచి గట్టిపోటీ ఎదురైనా... కమిటీ మాత్రం సానియా వైపే మొగ్గు చూపింది. ప్రొఫెషనల్ సర్క్యూట్‌లో మూడు మిక్స్‌డ్ డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ (ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్) గెలిచిన 28 ఏళ్ల సానియా 2014 ఆసియా గేమ్స్‌లోనూ స్వర్ణం, కాంస్య పతకాలను గెలుచుకుంది. తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సానియాకు గతంలో అర్జున (2004), పద్మశ్రీ (2006) పురస్కారాలు కూడా లభించాయి.

 అర్జున అవార్డుకు ఎంపికైన మరో 14 మంది
 పూవమ్మ (అథ్లెటిక్స్), పీఆర్ శ్రీజేశ్ (హాకీ), దీపా కర్మాకర్ (జిమ్నాస్టిక్స్), జీతు రాయ్ (షూటింగ్), సందీప్ కుమార్ (ఆర్చరీ), మన్‌దీప్ జాంగ్రా (బాక్సింగ్), బబిత, భజ్‌రంగ్ (రెజ్లింగ్),  స్వరణ్ సింగ్ విర్క్ (రోయింగ్), సతీశ్ శివలింగం (వెయిట్‌లిఫ్టింగ్), సంతోయ్ దేవి (వుషు), శరత్ గైక్వాడ్ (ప్యారా సెయిలింగ్), మన్‌జీత్ చిల్లార్, అభిలాష మహాత్రే (కబడ్డీ).
 
 రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు నామినేట్ కావడం పట్ల భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అమితానందం వ్యక్తం చేసింది. మార్టినా హింగిస్‌తో కలిసి రోజర్స్ కప్ ఆడేందుకు ప్రస్తుతం సానియా, టొరంటో (కెనడా)లో ఉంది. ట్విట్టర్ ద్వారా ఆమె తన సంతోషాన్ని పంచుకుంది. ‘వాహ్....టొరంటోలో శుభోదయం. భారత్‌నుంచి ఇప్పుడే అద్భుతమైన వార్త తెలిసింది. ఖేల్త్న్రతో గౌరవించబడటం సంతోషకరం. అందరికీ కృతజ్ఞతలు’ అని సానియా వ్యాఖ్యానించింది.
 
  ఆకాశంలో విహరిస్తున్నట్లు ఉంది
 ‘నా జీవితంలో అత్యంత ఆనందకర క్షణం. ఆకాశంలో విహరిస్తున్నట్లుంది. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన రోజు స్కేటింగ్‌కు గుర్తింపు దక్కినట్లుగా భావించాను. ఇప్పుడు స్కేటర్‌కు అర్జున ఇచ్చి కేంద్ర ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించింది. ఎప్పుడో 1989లో నమన్ పారిఖ్‌కు ఈ అవార్డు వచ్చినట్లు విన్నాను. దాదాపు 26 ఏళ్ల తర్వాత మళ్లీ ఒక స్కేటర్‌కు దక్కడం పట్ల నేను గర్వపడుతున్నా. గతంలో ఒకటి, రెండు సార్లు అవార్డును ఆశించి రాకపోవడంతో నిరాశ చెందాను. అయితే పట్టుదలతో మరిన్ని విజయాలు సాధించాను. నా కోచ్‌గా, మార్గదర్శిగా ఉన్న మా నాన్న వల్లే ఇది సాధ్యమైంది. ఆయనకు అవార్డు అంకితం’ 
-అనూప్ యామా (స్కేటర్)
 
 
అవార్డును ఊహించా!
 ‘అర్జున అవార్డు ప్రకటన పట్ల చాలా సంతోషంగా ఉన్నా. ఎన్ని టోర్నీలు గెలిచినా ప్రభుత్వ గుర్తింపు ప్రత్యేకత వేరు. నా తల్లిదండ్రులు, కోచ్‌లతో పాటు కెరీర్‌లో అండగా నిలిచినవారందరికీ  ఈ అవార్డు అంకితం. గత ఏడాది కాలంగా నా ప్రదర్శన చాలా బాగుంది. ఈ సంవత్సం నాకేదో మంచి జరగబోతోందని ఊహించా. అది అర్జున రూపంలో వచ్చినట్లుంది. మరింత బాగా ఆడేందుకు ఈ అవార్డులు ప్రోత్సాహకంగా నిలుస్తాయి. ఇప్పటి వరకు నా కెరీర్ సాగుతున్న తీరు, సాధించిన ఘనతల పట్ల సంతృప్తిగా ఉన్నా. పెద్ద ఈవెంట్లలో మరింత నిలకడ ప్రదర్శించాల్సి ఉంది. ప్రస్తుతం ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకమే నా లక్ష్యం’   
  -‘సాక్షి’తో కిడాంబి శ్రీకాంత్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement