సీన్(మ్) మారింది! | scene was changed | Sakshi
Sakshi News home page

సీన్(మ్) మారింది!

Published Tue, Feb 24 2015 12:02 AM | Last Updated on Sat, Sep 2 2017 9:47 PM

సీన్(మ్) మారింది!

సీన్(మ్) మారింది!

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో ఆధిపత్యం ప్రదర్శించేందుకు అవకాశం అందివచ్చిన ప్రతీసారి పట్టు జారవిడిచారు. ముక్కోణపు సిరీస్‌లో అయితే సగానికి పైగా బంతులు వికెట్లకు దూరంగా విసిరారు. వికెట్ తీయడం సంగతి దేవుడెరుగు...లైన్ అండ్ లెంగ్త్‌లో నిలకడగా బౌలింగ్ చేస్తే చాలనిపించారు.

ఈ బౌలింగ్‌ను నమ్ముకొనా భారత్ ప్రపంచకప్ ఆడుతోంది అని చర్చకు తెర తీశారు. ఇదంతా భారత జట్టు పేసర్ బౌలర్ల గురించి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఆ బౌలింగ్ బృందమే ఆహా...ఓహో అనిపిస్తోంది. రెండు మ్యాచ్‌లలో అద్భుతంగా ఆడిన తీరు వారిపై నమ్మకం పెరిగేలా చేస్తోంది. టైటిల్ నిలబెట్టుకునే క్రమంలో ఇక పేస్‌పై ఆధారపడవచ్చనే ధైర్యాన్ని ఇస్తోంది.
 
సాక్షి క్రీడా విభాగం
దక్షిణాఫ్రికాపై మ్యాచ్ గెలిచిన తర్వాత భారత పేస్ బౌలర్ల గురించి కెప్టెన్ ధోని చేసిన ప్రశంస చూస్తే అతను వారిని ఎంతగా నమ్మాడో, వారు దానిని ఎలా నిలబెట్టారో అనే ఆనందం కనిపిస్తుంది. ‘మా ప్రణాళికలు సరిగ్గా అమలు కావడంలో పేసర్లదే ముఖ్య భూమిక. ఫాస్ట్ బౌలర్లకు కావాల్సిన విధంగా నేను ఫీల్డింగ్ ఏర్పాటు చేయగలిగాను. వారు ఒక్కటి కూడా తేలికైన బంతి వేయలేదు. కట్టుదిట్టంగా చక్కటి లైన్‌లో బౌలింగ్ చేశారు.

దాంతో తప్పనిసరిగా బ్యాట్స్‌మెన్ భారీ షాట్లు ఆడాల్సిన పరిస్థితి కల్పించారు. నెట్స్‌లో వారి శ్రమకు ఇప్పడు ఫలితం దక్కింది’ అని ధోని చెప్పాడు. సాధారణంగా భారత్ తమ బ్యాటింగ్ బలాన్ని నమ్ముకొనే ఎక్కువ సందర్భాల్లో మ్యాచ్‌లు గెలిచింది. బౌలర్లు విఫలమైనా, భారీ స్కోరు జట్టుకు అండగా నిలిచింది. కానీ ఇప్పుడు మన పేసర్లు కూడా మ్యాచ్‌ను మలుపు తిప్పగలరని గత రెండు మ్యాచ్‌లు నిరూపించాయి. పేస్ త్రయం ఉమేశ్ యాదవ్, మొహమ్మద్ షమీ, మోహిత్ శర్మ బౌలింగ్‌లో వైవిధ్యం ప్రదర్శిస్తూ సత్తా చాటడం సంతోషకర పరిణామం.
 
ఉమేశ్ యాదవ్
వేగమే ఉమేశ్ బలం. నిలకడగా 140 కిలో మీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు. టెస్టు సిరీస్‌లో ఫర్వాలేదనిపించిన ఉమేశ్, తర్వాతి వన్డేల్లో మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. అయితే ప్రపంచకప్‌లో పాక్‌తో మ్యాచ్‌లో మాత్రం కీలక సమయంలో జట్టుకు బ్రేక్ ఇచ్చాడు. జట్టు ఇన్నింగ్స్‌ను తీర్చిదిద్దుతున్న సమయంలో షెహజాద్‌ను అవుట్ చేసిన ఉమేశ్... అదే ఓవర్లో మరో వికెట్ తీసి పాక్ ఆశలకు కళ్లెం వేశాడు.

దక్షిణాఫ్రికాతో అయితే వికెట్లు తీయకపోయినా, ఆరంభంలో ఒత్తిడి పెంచడంతో సఫలమయ్యాడు. దాంతో ఒత్తిడి పెరిగి మరో ఎండ్‌నుంచి వికెట్లు దక్కాయి. గతంతో పోలిస్తే అతని బౌలింగ్‌లో నియంత్రణ పెరిగింది. తన వేగాన్ని తగ్గించుకోకుండానే అతను పట్టు సాధించడం విశేషం.
 
మొహమ్మద్ షమీ
షమీ కెరీర్‌లో భారత్ గెలిచిన 22 మ్యాచ్‌లలో అతని బౌలింగ్ సగటు (22.53) చాలా బాగుంది. ఆసీస్ పర్యటనలో అయితే ధారాళంగా చెత్త బంతులు విసిరాడు. అయితే ఇప్పుడు మెరుగయ్యాడు. షార్ట్ పిచ్ బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడుతున్నాడు. కీలక సమయం లో వికెట్లు కూడా తీస్తున్నాడు.

అయితే ఆసీస్‌తో వార్మప్ మ్యాచ్‌లో ఏకంగా 83 పరుగులు ఇవ్వడంతో అతని బౌలింగ్‌పై సందేహాలు తలెత్తాయి. అసలు మ్యాచ్‌లలో షమీ ఆ అనుమానాలు పటాపంచలు చేశాడు. పాక్‌పై తీసిన 4 వికెట్లు భారత్‌ను మ్యాచ్‌లో నిలబెట్టాయి. తన బౌన్స్‌నే బలంగా చేసుకొని దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు.
 
మోహిత్ శర్మ
ఇషాంత్ గాయంతో జట్టులోకి వచ్చిన మోహిత్, ఇప్పుడు భువనేశ్వర్ గాయంతో తన సత్తా చాటే అవకాశం దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాలో అడుగు పెట్టక ముందు కేవలం 11 మ్యాచ్‌లే ఆడిన అతను ఒక్కసారిగా ఇక్కడి పిచ్‌లను తనకు అనుకూలంగా మలచుకున్నాడు. భువీని మరిపిస్తూ స్వింగ్‌తో చెలరేగిపోతున్నాడు. ప్రపంచకప్‌లో రెండు, అంతకు ముందు ఆడిన ఒక మ్యాచ్‌లో కూడా మోహిత్ రెండేసి వికెట్లు తీశాడు.

పూర్తి కోటా వేసిన మ్యాచ్‌లో కూడా ఇచ్చిన పరుగులు 36 మాత్రమే. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో అయితే సరిగ్గా ఆఫ్ స్టంప్‌పై దాడి చేస్తూ ఎక్కడా కట్టు దాటకుండా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆమ్లా వికెట్‌తో పాటు డు ప్లెసిస్‌ను వ్యూహాత్మకంగా అవుట్ చేసిన బంతి మోహిత్ ప్రతిభను చూపించింది. రాబోయే మ్యాచ్‌లలో కూడా మోహిత్ ప్రమాదకారి కాగలడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement