వింబుల్డన్ విజేత సెరెనా
లండన్ : సెరెనా విలియమ్స్.. ఈ ఏడాది ఎట్టకేలకు తొలి గ్రాండ్ స్లామ్ సాధించింది. రసవత్తరంగా సాగిన మ్యాచ్ లో.. వరుస రెండు సెట్లలో పోరును ముగించి వింబుల్డన్ విజేతగా నిలిచింది. మహిళల సింగిల్స్లో భాగంగా శనివారం జరిగిన ఫైనల్ పోరులో డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ 7-5, 6-3 తేడాతో ఎంజెలిక్ కెర్బర్(జర్మనీ)పై గెలిచి వింబుల్డన్ టైటిల్ను సాధించింది. ఏకపక్షంగా సాగిన పోరులో సెరెనా ఆద్యంత ఆకట్టుకుని ఏడోసారి వింబుల్డన్ టైటిల్ ను ముద్దాడింది. తద్వారా జర్మనీ క్రీడాకారిణి స్టెఫీగ్రాఫ్ పేరిట ఉన్న 22 గ్రాండ్ స్లామ్ రికార్డును సమం చేసింది. దాంతోపాటు ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ వేటలో కెర్బర్ చేతిలో ఓటమికి సెరెనా ఘనంగా ప్రతీకారం తీర్చుకుంది.
తొలి సెట్ ఆరో గేమ్లో కెర్బర్ సర్వీస్ను బ్రేక్ చేసిన సెరెనా.. ఆ తరువాత తన సర్వీస్ను కాపాడుకుని ఆ సెట్ను దక్కించుకుంది. ఇక రెండో సెట్లో కెర్బర్ నుంచి సెరెనా కాస్త పోటీ ఎదుర్కొంది. రెండో సెట్ లో సెరెనా 2 -1 తో ఆధిక్యంలో ఉన్న దశలో కెర్బర్ పుంజుకుంది. తన సర్వీసును కాపాడుకోవడంతో పాటు, సెరెనా సర్వీస్ను బ్రేక్ చేయడంతో స్కోరు 3-3తో సమం చేసింది కాగా, ఆ తరువాత నాల్గో గేమ్లో తన సర్వీసును కాపాడుకున్న సెరెనా.. ఐదో గేమ్లో బ్రేక్ పాయింట్ ద్వారా ఆధిక్యం సాధించింది. ఇక ఆరో గేమ్ను సెరెనా సునాయాసంగా గెలిచి టైటిల్ను తన ఖాతాలో వేసుకుంది. మరోవైపు స్టెఫీగ్రాఫ్ తర్వాత వింబుల్డన్ సాధించిన తొలి జర్మనీ క్రీడాకారిణిగా నిలవాలనుకున్న కెర్బర్ రన్నరప్ గా సరిపెట్టుకుంది.