ఒకవైపు టాప్–10 సీడెడ్ క్రీడాకారిణులు క్వార్టర్ ఫైనల్లోపే ఇంటిదారి పట్టగా... మరోవైపు తొలి రౌండ్ నుంచి నిలకడగా ఆడిన మాజీ నంబర్‌వన్ ఎంజెలిక్ కెర్బర్ టైటిల్ పోరులోనూ అదరగొట్టింది. 23 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ విజేత సెరెనా విలియమ్స్ (అమెరికా)తో శనివారం జరిగిన ఫైనల్లో కెర్బర్ 65 నిమిషాల్లోనే విజయగర్జన చేసింది. తొలిసారి ప్రతిష్టాత్మక వింబుల్డన్ టైటిల్‌ను సొంతం చేసుకోవడంతోపాటు కెరీర్‌లో మూడో గ్రాండ్‌స్లామ్ ట్రోఫీని దక్కించుకుంది.
లండన్: రికార్డు స్థాయిలో 24వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్‌కు నిరాశ ఎదురైంది. 11వ సీడ్ ఎంజెలిక్ కెర్బర్ అద్భుత ఆటతీరుతో సెరెనా ఆట కట్టించింది. శనివారం జరిగిన వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో 30 ఏళ్ల కెర్బర్ 6–3, 6–3తో 36 ఏళ్ల సెరెనాను ఓడించింది. ఈ క్రమంలో స్టెఫీ గ్రాఫ్ (1996లో) తర్వాత వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గిన జర్మనీ క్రీడాకారిణిగా ఆమె గుర్తింపు పొందింది. విజేతగా నిలిచిన కెర్బర్‌కు 22 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 20 కోట్ల 40 లక్షలు); రన్నరప్ సెరెనాకు 11 లక్షల 25 వేల పౌండ్లు (రూ. 10 కోట్ల 20 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఫైనల్ చేరే క్రమంలో తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ మాత్రమే కోల్పోయిన కెర్బర్ అంతిమ పోరులో మాత్రం ఆరంభం నుంచే ఆధిపత్యం చలాయించింది. తొలి గేమ్‌లో సెరెనా సర్వీస్‌ను బ్రేక్ చేసిన కెర్బర్ ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే నాలుగో గేమ్‌లో కెర్బర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన సెరెనా స్కోరును 2–2తో సమం చేసింది. కానీ కెర్బర్ మళ్లీ పుంజుకొని ఏడో గేమ్‌లో, తొమ్మిదో గేమ్‌లో సెరెనా సర్వీస్‌లను బ్రేక్ చేసి సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్‌లోనూ కెర్బర్ తన జోరు కొనసాగించగా... సెరెనా డీలా పడిపోయింది.
విశేషాలు
కెర్బర్ సెరెనా
1 ఏస్‌లు 4
1 డబుల్ ఫాల్ట్‌లు 2
2/6 నెట్ పాయింట్లు 12/24
4/7 బ్రేక్ పాయింట్లు 1/1
11 విన్నర్స్ 23
5 అనవసర తప్పిదాలు 24
56 మొత్తం పాయింట్లు 45
Comments
Please login to add a commentAdd a comment