స్టెఫీ సరసన సెరెనా | Serena Williams beats Angelique Kerber to win 22nd Grand Slam | Sakshi
Sakshi News home page

స్టెఫీ సరసన సెరెనా

Published Sun, Jul 10 2016 2:36 AM | Last Updated on Mon, Sep 4 2017 4:29 AM

స్టెఫీ సరసన సెరెనా

స్టెఫీ సరసన సెరెనా

నిరీక్షణ ముగిసింది. సెరెనా సాధించింది. పది నెలల నుంచి అందినట్టే అంది చేజారిపోతోన్న అరుదైన రికార్డును ఈ నల్లకలువ వింబుల్డన్ వేదికగా అందుకుంది. ఓపెన్ శకంలో (1968 తర్వాత) అత్యధికంగా 22 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారిణిగా స్టెఫీ గ్రాఫ్ పేరిట ఉన్న రికార్డును సెరెనా సమం చేసింది. గతేడాది వింబుల్డన్ టైటిల్ సాధించాక... యూఎస్ ఓపెన్ సెమీస్‌లో నిష్ర్కమించడం... ఈ సంవత్సరం ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో, ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలువడంతో సెరెనాకు ఈ ఘనత సాధించడం కాస్త ఆలస్యమైంది.
 
22వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన అమెరికా స్టార్
స్టెఫీ గ్రాఫ్ రికార్డు సమం
ఏడోసారి వింబుల్డన్ ట్రోఫీ కైవసం
ఫైనల్లో కెర్బర్‌పై విజయం
రూ. 17 కోట్ల 39 లక్షల ప్రైజ్‌మనీ సొంతం

లండన్: ఈ ఏడాది రెండు గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫైనల్స్‌లో తడబడిన సెరెనా... ముచ్చటగా మూడో గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో మాత్రం ఎలాంటి పొరపాటు చేయలేదు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని విజేతగా నిలిచింది. తన కెరీర్‌లో 22వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. తద్వారా జర్మనీ దిగ్గజం స్టెఫీ గ్రాఫ్ పేరిట ఉన్న రికార్డును సమం చేసింది. సెంటర్ కోర్టులో శనివారం జరిగిన వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ సెరెనా (అమెరికా) 7-5, 6-3తో నాలుగో సీడ్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ)ను ఓడించింది.

ఈ క్రమంలో ఏడోసారి వింబుల్డన్ టైటిల్‌ను కైవసం చేసుకోవడంతోపాటు 20 లక్షల పౌండ్లను (రూ. 17 కోట్ల 39 లక్షలు) ప్రైజ్‌మనీగా అందుకుంది. రన్నరప్ కెర్బర్‌కు 10 లక్షల పౌండ్ల (రూ. 8 కోట్ల 69 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది. 1995 నుంచి ప్రొఫెషనల్ టెన్నిస్ ఆడుతోన్న సెరెనా కెరీర్‌లో ఓవరాల్‌గా ఇది 71వ సింగిల్స్ టైటిల్. అత్యధిక సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన జాబితాలో సెరెనా ఐదో స్థానంలో ఉంది. మార్టినా నవ్రతిలోవా (167 టైటిల్స్), క్రిస్ ఎవర్ట్ (154), స్టెఫీ గ్రాఫ్ (107), మార్గరెట్ కోర్ట్ (92) తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు.
 
బదులు తీర్చుకుంది
ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో కెర్బర్ చేతిలో ఓడిపోయిన సెరెనా వింబుల్డన్‌లో మాత్రం ఈ జర్మనీ క్రీడాకారిణిని ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. 81 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సెరెనాకు కెర్బర్ నుంచి గట్టిపోటీనే ఎదురైంది. సుదీర్ఘంగా సాగిన పలు ర్యాలీల్లో ఇద్దరూ పోటీపడి పాయింట్లు గెలిచారు. అయితే కీలకదశలో మాత్రం సెరెనా తన పవర్‌ఫుల్ ఆటతీరుతో కెర్బర్‌పై పైచేయి సాధించింది.

తొలి సెట్ 12వ గేమ్‌లో కెర్బర్ సర్వీస్‌ను బ్రేక్ చేసి సెరెనా సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్ ఎనిమిదో గేమ్‌లో మరోసారి కెర్బర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన సెరెనా... తొమ్మిదో గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో సెరెనా కళ్లు చెదిరేరీతిలో సర్వీస్ చేసింది. ఆమె ఏకంగా 13 ఏస్‌లు సంధించింది. మరోవైపు కెర్బర్ ఒక్క ఏస్‌ను కూడా కొట్టలేకపోయింది.
 
ఓపెన్ శకంలో మహిళల గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన పెద్ద వయస్కురాలిగా సెరెనా (34 ఏళ్ల 283 రోజులు) నిలిచింది. గతేడాది వింబుల్డన్‌లో 33 ఏళ్ల 285 రోజుల వయస్సులో టైటిల్ నెగ్గిన సెరెనా ఈసారీ విజేతగా నిలిచి తన పేరిటే ఉన్న రికార్డును సవరించింది.
   
మరో రెండు టైటిల్స్ సెరెనా సాధిస్తే... మహిళల టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియా-24 టైటిల్స్) రికార్డును సమం చేస్తుంది.
అత్యధికసార్లు వింబుల్డన్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన క్రీడాకారిణుల జాబితాలో సెరెనా సంయుక్తంగా మూడో స్థానానికి చేరుకుంది. సెరెనాతోపాటు స్టెఫీ గ్రాఫ్ (జర్మనీ), డోరెతి లాంబర్ట్ చాంబర్స్ (బ్రిటన్) ఏడుసార్లు చొప్పున ఈ టైటిల్‌ను సాధించారు. ఈ జాబితాలో మార్టినా నవ్రతిలోవా (9 సార్లు), హెలెన్ విల్స్ మూడీ (8 సార్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
సెరెనా 1999లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గినప్పటి నుంచి ఇప్పటివరకు 20 మంది వేర్వేరు క్రీడాకారిణులు కూడా గ్రాండ్‌స్లామ్ చాంపియన్స్‌గా నిలిచారు.
 
‘‘ముందుగా దేవుడికి కృతజ్ఞతలు. ఆయన కరుణ లేకుంటే నేనీ ఘనత సాధించకపోయేదాన్ని. నా విజయంలో కుటుంబసభ్యులు, సహాయక సిబ్బంది పాత్ర ఎంతో ఉంది. వింబుల్డన్ సెంటర్ కోర్టు నాకు ఇల్లు లాంటిది. 22 సంఖ్య అద్వితీయ అనుభూతినిస్తోంది. కెర్బర్‌తో ఆడితే నాలోని అత్యుత్తమ ఆటతీరు బయటకొస్తుంది. గ్రాఫ్ రికార్డును సమం చేసినందుకు గొప్పగా అనిపిస్తోంది.’’                
- సెరెనా

 
సెరెనా గ్రాండ్‌స్లామ్ టైటిల్స్(22)
ఆస్ట్రేలియన్ ఓపెన్ (6): 2003, 2005, 2007, 2009, 2010, 2015
{ఫెంచ్ ఓపెన్ (3): 2002, 2013, 2015
వింబుల్డన్ (7): 2002, 2003, 2009, 2010, 2012, 2015, 2016
యూఎస్ ఓపెన్ (6): 1999, 2002, 2008, 2012, 2013, 2014
 
సెరెనా సాధించిన 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌లో తొమ్మిది ఆమెకు 30 ఏళ్ల వయసు దాటాకే రావడం విశేషం.
 
సెరెనా 22 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గేందుకు 346 మ్యాచ్‌లు ఆడింది. స్టెఫీ గ్రాఫ్ 303 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించింది.

ఓపెన్ శకంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లు (304) నెగ్గిన రెండో క్రీడాకారిణి సెరెనా. మార్టినా నవ్రతిలోవా (306 మ్యాచ్‌లు) తొలి స్థానంలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement