
ఇండియన్ వెల్స్: పునరాగమనంలో అమెరికా టెన్నిస్ తార సెరెనాకు మరో ఓటమి. ఈసారి ఆమెపై అక్క వీనస్ పైచేయి సాధించింది. సోమవారం జరిగిన ఇండియన్ వెల్స్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నీ మహిళల సింగిల్స్ మూడో రౌండ్‌లో వీనస్ 6–3, 6–4తో సెరెనాను వరుస సెట్లలో ఓడించింది. గంటా 26 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో పదో సీడ్ వీనస్ ఆరు ఏస్‌లు సంధించింది. సెరెనా నాలుగే ఏస్‌లు కొట్టగా, నాలుగుసార్లు సర్వీస్ కోల్పోయింది.
మరో మ్యాచ్‌లో యూఎస్ ఓపెన్ విజేత స్లోన్ స్టీఫెన్స్... 19వ సీడ్ డరియా కసట్కినా (రష్యా) చేతిలో ఓడగా, ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంప్ వోజ్నియాకి 6–4, 2–6, 6–3తో అలెక్సాండ్రా సస్నోవిచ్‌పై గెలుపొందింది. పురుషుల విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, డిఫెండింగ్ చాంపియన్ రోజర్ ఫెడరర్ 6–2, 6–1తో ఫిలిప్ క్రజినోవిక్ (సెర్బియా)పై విజయం సాధించాడు. డ్రాప్ షాట్లు మేళవిస్తూ ఆరు ఏస్‌లు కొట్టిన రోజర్ ఒక దశలో వరుసగా 17 పాయింట్లు సాధించాడు. 58 నిమిషాల్లోనే మ్యాచ్ ముగించాడు. ఫెడరర్ ఈసారీ టైటిల్ సాధిస్తే రికార్డు స్థాయిలో ఆరోసారి గెల్చుకున్న ఆటగాడిగా నిలుస్తాడు.
Comments
Please login to add a commentAdd a comment