మనోభావాలు దెబ్బతిన్నాయ్..!
రియో డి జనీరో: బ్రెజిల్.. సెక్సువల్ టూరిజంకు పెట్టింది పేరు.. ఫిఫా ప్రపంచకప్‌కు ఆ దేశం ఆతిథ్యమిస్తుండటంతో ఇప్పుడు అందరి దృష్టి బ్రెజిల్‌పైనే ఉంది. ఈ నేపథ్యంలో బ్రెజిల్‌కు లక్షల్లో అభిమానులు రానుండటంతో సాకర్ క్రేజ్‌ను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అడిడాస్ సంస్థ ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఆరంభంలో రెండు టీ షర్టులను మార్కెట్లోకి విడుదల చేసింది.
అయితే టీ షర్టులపై ముద్రించిన చిత్రాలు, ట్యాగ్‌లైన్లు వివాదాస్పదమయ్యాయి. ‘లుక్ ఇన్ టు స్కోర్ బ్రెజిల్’, ‘ఐ లవ్ బ్రెజిల్’ ఈ టీ షర్టుల ట్యాగ్‌లైన్ ద్వందార్థాలు వచ్చేలా ఉన్నాయి. దీనిపై బ్రెజిల్‌లో వ్యతిరేకత వ్యక్తమయింది. మా మనోభావాలు దెబ్బతిన్నాయంటూ బ్రెజిల్ ప్రభుత్వం ఈ రెండు టీ షర్టులను ఉపసంహరించుకోవాలని అడిడాస్‌కు సూచించింది. దీంతో చేసేది లేక బ్రెజిల్‌లో ఈ టీషర్టుల అమ్మకం చేపట్టకుండానే అడిడాస్ వీటిని ఉపసంహరించుకుంది.
మా పొట్ట కొడుతున్నారు
సాకర్ ప్రపంచకప్ చూసేందుకు లక్షల్లో అభిమానులు వస్తారని.. నెల రోజుల పాటు తమ వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలు చందాన సాగుతుందని బ్రెజిల్ సెక్స్ వర్కర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. కొందరైతే ఒక అడుగు ముందుకేసి విటులను ఆకట్టుకునేందుకు ప్రత్యేకంగా ఇంగ్లిష్ కూడా నేర్చుకుంటున్నారు. ఇక ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని కండోమ్ కంపెనీలైతే తమ ఉత్పత్తులను అమాంతం పెంచేశాయి.
వీళ్లందరి ఆశలపై నీళ్లు చల్లుతూ బ్రెజిల్ ప్రభుత్వం సెక్స్‌వర్కర్లపై ఉక్కుపాదం మోపుతోంది. సెక్సువల్ టూరిజానికి పెట్టింది పేరన్న అపప్రదను వీలైనంత వరకు తగ్గించుకోవడంలో భాగంగా వందలాది మంది సెక్స్ వర్కర్లను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. నిజానికి బ్రెజిల్‌లో వ్యభిచారం చట్టబద్ధమే. అయితే ప్రపంచకప్ సమయంలో వీరిని అదుపులోకి తీసుకోవడం ద్వారా క్రైమ్ రేట్ తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.
దీంతో పాటు వ్యభిచారానికి పాల్పడుతున్న బాలికలను అదుపులో ఉంచవచ్చన్నది వీరి భావన. బ్రెజిల్‌లో ఇటీవలి కాలంలో బాలికలు కూడా వ్యభిచార వృత్తిలోకి దిగడం ఎక్కువైపోతోంది. ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యతో అక్కడి సెక్స్‌వర్కర్లలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై వారు బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల చర్యలకు నిరసనగా ఆందోళనలకు దిగుతున్నారు. మొత్తానికి బ్రెజిల్ ప్రభుత్వం చేపట్టిన చర్య మంచిదే అయినా సెక్స్‌వర్కర్లు మాత్రం తమ పొట్టకొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.