
కోహ్లి అండ్ గ్యాంగ్ కు థాంక్స్: ఆఫ్రిది
కరాచీ: భారత-పాకిస్తాన్ క్రికెట్ జట్లు ముఖాముఖి తలపడుతున్నాయంటే ఆటగాళ్ల మధ్య ఉద్వేగపూరిత వాతావరణం ఉంటుందనే అందరికీ తెలిసిన విషయమే. అయితే చాలా ఏళ్ల నుంచి భారత్ -పాకిస్తాన్ జట్లు ద్వైపాక్షిక సిరీస్ లకు దూరంగా ఉంటున్నాయి. కొన్ని కారణాలతో ఇరు దేశాలు ముఖాముఖి పోరులో తలపడటం లేదు.
కాగా, పాకిస్తాన్ క్రికెటర్లతో భారత్ ఆటగాళ్లకు ఆఫ్ ఫీల్డ్ సంబంధాలు మెరుగ్గా ఉన్నాయనడానికి ఇటీవల చోటు చేసుకున్న ఘటనే ఉదాహరణ. కొన్ని రోజుల క్రితం కరాచీలో షాహిద్ ఆఫ్రిది నూతన గృహప్రవేశం సందర్భంగా భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి అరుదైన గిఫ్ట్ అందజేశాడు. 'విరాట్ 18' అని ముద్రించి ఉన్న ఒక టీషర్ట్ను ఆఫ్రిదికి కానుకగా ఇచ్చాడు. ఈ కానుకను ఫ్రేమ్ కట్టించుకుని పెట్టుకున్న ఆఫ్రిది.. తాజాగా కోహ్లికి, భారత క్రికెట్ జట్టుకు కృతజ్ఞతలు తెలియజేశాడు. 'ఈ అద్భుతమైన ఫేర్వెల్ గిఫ్ట్ను నాకు ఇచ్చిన విరాట్ కు అతని జట్టుకు థాంక్స్. ఇది ఎప్పటికీ నాకు ప్రత్యేకమే. విరాట్ అంటే నాకు చాలా అభిమానం. త్వరలోనే విరాట్ ను కలుస్తానని ఆశిస్తున్నా' అని ట్విట్టర్ వేదికగా ఆఫ్రిది పేర్కొన్నాడు.
ఇదిలా ఉంచితే ఆఫ్రిదికి ఇచ్చిన ఆ జెర్సీపై కోహ్లి పేరుతో పాటు, ఆశిష్ నెహ్రా, సురేశ్ రైనా, మొహ్మద్ షమీ, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, అజింక్యా రహానే, శిఖర్ ధావన్, రవిచంద్రన్ అశ్విన్, హార్దిక్ పాండ్యా మిగతా పలువురి ఆటగాళ్ల సంతకాలు దర్శనమిచ్చాయి.