
న్యూఢిల్లీ: తొలి ఐపీఎల్‌లో షేన్ వార్న్ నాయకత్వంలోని రాజస్తాన్ రాయల్స్ జట్టు అనూహ్యంగా రాణించి చాంపియన్‌గా నిలిచింది. చెప్పుకోదగ్గ స్టార్లు లేని, కుర్రాళ్లతో నిండిన ఆ టీమ్‌ను వార్న్ సమర్థంగా నడిపించి, వారి ద్వారా అద్భుత ఫలితాలు రాబట్టాడు. తన ఆత్మ కథ ‘నో స్పిన్’లో 2008 ఐపీఎల్ సీజన్‌కు సంబంధించి కొన్ని ఆసక్తికర అంశాలు వెల్లడించాడు. భారత జట్టు తరఫున ఆడిన క్రికెటర్ల ఆలోచనలు ఎలా ఉంటాయో, తాము ఇతరులకంటే ఎక్కువ అనే భావనతో ఎలా ప్రవర్తిస్తారో చెబుతూ అతను మొహమ్మద్ కైఫ్‌తో తనకు ఎదురైన అనుభవాన్ని వివరించాడు. మునాఫ్ పటేల్, రవీంద్ర జడేజాల గురించి కూడా అతను ఇందులో ప్రస్తావించాడు.
‘రాజస్తాన్ జట్టు హోటల్‌లోకి ప్రవేశించిన తర్వాత అందరు ఆటగాళ్లు ఎవరి గదుల్లోకి వారు వెళ్లిపోయారు. అయితే కైఫ్ మాత్రం రిసెప్షన్ వద్దకు వెళ్లి నా పేరు కైఫ్ అని చెప్పాడు. రిసెప్షనిస్ట్ తనకు తెలుసన్న చెప్పిన తర్వాత మరోసారి నా పేరు కైఫ్ అని గుర్తు చేశాడు. నేను దగ్గరకు వెళ్లి ఏమైనా సమస్య ఉందా అని అడిగితే అవును, నా పేరు కైఫ్ అని మూడోసారి అదే మాట అన్నాడు. నువ్వెవరో వారికి తెలుసు కానీ ఇబ్బందేమిటని నేనే అడిగాను. అందరిలాగే నాకు చిన్న గది ఇచ్చారు. నా పేరు కైఫ్ అని అతను మళ్లీ చెప్పాడు! దాంతో అతని ఉద్దేశం ఏమిటో నాకు అర్థమైంది. నేను సీనియర్‌ను, భారత్ తరఫున ఆడిన వాడిని, కాబట్టి నాకు పెద్ద గది కావాలనేది అతని మాటల్లో ధ్వనించింది. ఎక్కువగా ఆలోచించవద్దని, అందరు ఆటగాళ్లకు ఒకే తరహా గది ఇచ్చారని, నేను ఎక్కువ మందితో కలవాల్సి ఉంటుంది కాబట్టి పెద్ద గది ఇచ్చారని నేను చెప్పడంతో అతను వెళ్లిపోయాడు.
భారత సీనియర్ ఆటగాళ్లు ప్రత్యేక ప్రాధాన్యత కోరుకుంటారని నాకు అర్థమైంది’ అని వార్న్ నాటి ఘటన గురించి వెల్లడించాడు. మునాఫ్ పటేల్‌ను అతని వయసు గురించి అడిగితే ‘అసలు వయసా లేక ఐపీఎల్ వయసా’ అని అతను తిరిగి ప్రశ్నించాడని... చివరకు ఐపీఎల్ ప్రకారం తనకు 24 ఏళ్లని, అసలు వయసు ఒకవేళ 34 అయినా ఐపీఎల్‌లో మరిన్ని అవకాశాలు దక్కించుకునేందుకు 24 ఏళ్లే చెబుతానంటూ తనలోని హాస్య చతురతను బయట పెట్టాడని వార్న్ గుర్తు చేసుకున్నాడు. జడేజాను క్రమశిక్షణలో పెట్టేందుకు కూడా చాలా కష్టపడాల్సి వచ్చిందని కూడా దిగ్గజ స్పిన్నర్ వ్యాఖ్యానించాడు. ప్రతీసారి జడేజా ఆలస్యంగా వచ్చేవాడని, ఒకసారి హోటల్‌కు తిరిగి వెళుతుండగా మధ్యలో బస్సు నుంచి దించేసి నడుస్తూ రమ్మని శిక్ష విధించడంతో ఆ తర్వాత అంతా మారిపోయిందని వార్న్ వెల్లడించాడు.