
లండన్: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం స్టీవ్ వాపై అతని మాజీ సహచరుడు, స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ తీవ్రంగా విరుచుకు పడ్డాడు. స్టీవ్ స్వార్థపరుడని వార్న్ తన ఆత్మకథ ‘నో స్పిన్’లో పేర్కొన్నాడు. త్వరలో విడుదల కానున్న ఈ పుస్తకంలో అప్పటి తన కెప్టెన్‌తో ఎదురైన చేదు అనుభవాలను వార్న్ వివరించాడు. తనను అవమానకరంగా తప్పించేందుకు స్టీవ్ ప్రయత్నించాడని అందులో పేర్కొన్నాడు. 1999లో స్టీవ్ వా తనను తప్పించేందుకే నిర్ణయించుకున్నాడని చెప్పాడు. ‘వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ కోసం ఫామ్ సాకుతో నన్ను తప్పిస్తున్నట్లు వా చెప్పాడు. అప్పుడు నేను వైస్ కెప్టెన్‌ను. నా బౌలింగ్ కాస్త సాధారణంగా ఉంది. ఇదే అదనుగా కెప్టెన్ స్టీవ్ వా సెలక్షన్ మీటింగ్‌లో నన్ను తప్పించాల్సిందేనని పట్టుబట్టాడు.
కోచ్ జెఫ్ మార్‡్ష, సెలక్టర్ అలెన్ బోర్డర్ వారించినా వినిపించుకోలేదు’ అని వార్న్ ఆ అనుభవాన్ని వివరించాడు. తన మెరుగైన ప్రదర్శనపై ఒక్కోసారి స్టీవ్ అసూయ చెందేవాడని ఈ ఆత్మకథలో పేర్కొన్నాడు. నాటి సహచరులు లాంగర్, హెడెన్, గిల్‌క్రిస్ట్‌లు కూడా తనను ఇరికించే ప్రయత్నం చేశారని వార్న్ తన పుస్తకంలో రాశాడు. ఆసీస్ క్రికెటర్లకు బ్యాగీ గ్రీన్ (టీమ్ క్యాప్) పెద్ద గౌరవం. వింబుల్డన్ మ్యాచ్‌కు నేను దానిని ధరించి వెళ్లేలా వారు ప్రోత్సహించే ప్రయత్నం చేశారు. అదే చేస్తే బ్యాగీ గ్రీన్‌ను అవమానించినట్లుగా మళ్లీ నాపై దుష్ప్రచారం చేసేలా అది వారికి ఉపయోగపడేది’ అని వార్న్ చెప్పాడు. స్టీవ్‌వా సారథ్యంలో ఆడిన 38 టెస్టుల్లో 26.57 సగటుతో 175 వికెట్లు తీసిన వార్న్... 1999 ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.