మాజీ కెప్టెన్ పై తీవ్ర విమర్శలు
మెల్ బోర్న్: ప్రపంచ స్పిన్ దిగ్గజం, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్ వార్న్ తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ జట్టు మాజీ క్రికెటర్ స్టీవ్ వా అత్యంత స్వార్థపరుడని విమర్శించాడు. తాను క్రికెట్ ఆడిన సమయంలో, తాను చూసిన మోస్ట్ సెల్ఫిష్ క్రికెటర్ అంటూ ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవా వా పై విరుచుకుపడ్డాడు. అతడిని తాను ఇష్టపడకపోవటానికి ఎన్నో కారణాలున్నాయని 'ఐ యామ్ ఏ సెలబ్రిటీ' కార్యక్రమానికి హాజరైన వార్న్ వివరించాడు.
1999లో వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ లో చివరి మ్యాచ్ కు తనను స్టీవ్ దూరం చేశాడని.. ఆ సిరీస్ లో అప్పటికే ఆసీస్ వెనుకంజలో ఉంది. కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో తనకు చోటివ్వలేదని ఈ సందర్భంగా గుర్తుచేశాడు. ఆ సమయంలో తాను కెప్టెన్ అని కూడా చూడకుండా జట్టు నుంచి తప్పించాడని ఆరోపించాడు.
భుజాలెగరేశాను: షేన్ వార్న్
'ఆ సమయంలో తాను చాలా నిరాశచెందినప్పటికీ.. పదేళ్ల తర్వాత గర్వంగా భుజాలెగరవేశాను. ఎక్కడ మేం టెస్ట్ మ్యాచ్ గెలవాల్సి ఉన్నదో, అక్కడే ఉత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాను. నన్ను జట్టు నుంచి తప్పించిన అంటిగ్వా టెస్టులో కొలిన్ మిల్లర్ స్థానం దక్కించుకున్నాడు. చివరికి 176 పరుగుల విజయంతో వెస్టిండీస్ తో 2-2 ఫలితంతో సిరీస్ డ్రా అయింది' అని స్పిన్నర్ వార్న్ వివరించాడు. ఏది ఏమైతేనేం స్టీవ్ వా ను వ్యతిరేకించడానికి చాలా కారణాలున్నాయంటూ స్పిన్ దిగ్గజం వార్న్ పునరుద్ఘాటించాడు.