కోహ్లి, దాదాలకు వార్న్‌ విన్నపం ఇదే! | Shane Warne Hopes India Play Day Night Test Against Australia | Sakshi
Sakshi News home page

కోహ్లి, దాదాలకు వార్న్‌ విన్నపం ఇదే!

Published Sun, Nov 24 2019 1:30 PM | Last Updated on Sun, Nov 24 2019 1:30 PM

Shane Warne Hopes India Play Day Night Test Against Australia - Sakshi

కోల్‌కతా : భారత గడ్డపై తొలిసారి జరుగుతున్న అంతర్జాతీయ డేనైట్‌ టెస్ట్‌కు క్రికెట్‌ ఫ్యాన్స్‌ నుంచి విశేష స్పందన వస్తుండటంపై బీసీసీఐ ఆనందం వ్యక్తం చేస్తోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా పింక్‌ బాల్‌ టెస్టుపై అభిమానులు అమితమైన ఆసక్తి కనబర్చుతున్నట్లు పేర్కొంది. ఇక రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న పింక్‌ బాల్‌ టెస్టులో టీమిండియా అదరగొడుతోంది. ఈ చారిత్రక టెస్టులో ఇన్నింగ్స్‌ విజయంతో మూడో రోజే ఆటను ముగించే అవకాశం ఉంది కోహ్లి సేన. 

ఇక డేనైట్‌ టెస్టు విజయవంతం చేసినందుకు స్వదేశీ, విదేశీ తాజా, మాజీ క్రికెటర్లు బీసీసీఐపై, టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ టెస్టు క్రికెట్‌కు ఇది శుభపరిణామని పేర్కొన్నాడు. కాగా షేన్‌ వార్న్‌ ఓ అడుగు ముందుకేసి తన మనసులోని మాటను బయటపెట్టాడు. తొలి డేనైట్‌ టెస్టుతో భారత్‌ సంతృప్తితో ఉండటంతో భవిష్యత్‌లో ఇలాంటి మరిన్ని టెస్టులు ఆడాలని ఆకాంక్షించాడు. అంతేకాకుండా వచ్చే ఏడాది టీమిండియా ఆసీస్‌ పర్యటన నేపథ్యంలో అడిలైడ్‌లో డేనైట్‌ టెస్టు ఆడేలా చర్యలు తీసుకోవాలని సారథి విరాట్‌ కోహ్లి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీలకు వార్న్‌ కోరాడు.

ఇక ఈ టెస్టు ఆరంభానికి ముందు ఆసీస్‌లో కూడా డేనైట్‌ మ్యాచ్‌లు ఆడేందకు సిద్దంగా ఉన్నామని కోహ్లి పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే పింక్ బాల్‌ క్రికెట్‌కు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన ఆడిలైడ్‌లో తమకు ఒక ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఏర్పాటు చేయాలన్నాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్‌ గంగూలీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పింక్‌ బాల్‌ టెస్టుపై ఆమితాసక్తి కనబర్చిడు. వెంటనే తన ఆలోచనలను ఆచరణలో పెట్టాడు. సారథి కోహ్లిని, బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డును ఒప్పించి కోల్‌కత్‌లో డేనైట్‌ టెస్టుకు ఏర్పాట్లు చేశాడు. ఇక ఈ మ్యాచ్‌ విజయంవంతం కావడంతో అందరికంటే దాదా రెట్టింపు ఆనందంతో ఉన్నాడు. గతేడాదే టీమిండియా ఆసీస్‌ పర్యటనకు వెళ్లినప్పుడు డేనైట్‌ టెస్టు కోసం క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రతిపాదన పెట్టగా బీసీసీఐ సున్నితంగా తిరస్కరించింది. ఇక ఈ పర్యటనలో ఆసీస్‌ గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్‌ గెలుచుకుని రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement