సిడ్నీ: ఇంగ్లండ్-వేల్స్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఐసీసీ ప్రపంచకప్ 2019లో టీమిండియా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలంటే తన సూచనలు పాటించాలంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్. కోహ్లి సేన ఈ మెగా టోర్నీ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్న వార్న్.. జట్టులో కొన్ని మార్పులు జరగాలని సూచించాడు. ప్రపంచకప్‌లో ప్రత్యర్థి జట్టును అయోమయానికి గురిచేసేందుకు టీమిండియా ఓపెనర్లుగా రోహిత్ శర్మ, రిషబ్ పంత్‌లు రావాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ ప్రపంచకప్ గెలవాలంటే మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నాడు. అయితే దీనిపై సరైన వివరణే ఇచ్చాడు ఈ ఆసీస్ దిగ్గజ క్రికెటర్. ప్రపంచకప్ 1992లో భాగంగా న్యూజిలాండ్ ఓపెనర్లను మార్చిందని, అదేవిధంగా తొలి ఓవర్‌ను స్పిన్నర్‌తో బౌలింగ్ వేయించి సఫలీకృతమైన విషయాన్ని గుర్తుచేశాడు. ఇలాంటి మార్పులు చేయడంతో ప్రత్యర్థి జట్టు గందరగోళానికి గురవుతుందన్నాడు. ఇలాంటి విభిన్న మార్పులతోనే టీమిండియా బరిలోకి దిగితే గెలుపు తథ్యమన్నాడు.
అతడిని బ్యాట్స్‌మెన్‌గా ఎందుకు పరిగణించడం లేదు
ప్రపంచకప్‌లో పాల్గొనబోయే టీమిండియాలో సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోని తప్పకుండా ఉంటాడని వార్న్ ధీమా వ్యక్తం చేశాడు. యువ ఆటగాళ్లతో కూడిన కోహ్లి సేనకు ధోని సూచనలు ఎంతగానో ఉపయోగపడతాయన్నాడు. అంతేకాకుండా ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయడం ధోని అదనపు బలమంటూ ప్రశంసల జల్లు కురిపించాడు. అయితే ధోని కోసం పంత్‌ను పక్కకు పెట్టాల్సిన అవసరం లేదన్నాడు. పంత్‌ను వికెట్‌కీపర్‌గా కాకుండా బ్యాట్స్‌మన్‌గా పరిగణించి జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లోనే పంత్‌ను ఓపెనర్‌గా పంపించి ప్రయోగం చేయాలన్నాడు. భవిష్యత్ క్రికెట్ పంత్‌దే అంటూ కితాబిచ్చాడు. ఇక బౌలింగ్‌లోనూ టీమిండియా ఎప్పుడూ లేనివిధంగా బలంగా ఉందన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ధావన్ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ జట్టు గెలుపు కోసం కొన్ని త్యాగాలు చేయలన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment