క్రికెట్ కు షాన్ టెయిట్ గుడ్ బై
సిడ్నీ: ప్రపంచ క్రికెట్ ఫాస్టెస్ట్ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన ఆసీస్ ఫాస్ట్ బౌలర్ షాన్ టెయిట్ తన కెరీర్కు గుడ్ బై చెప్పేశాడు. కాంపిటేటివ్ స్థాయి క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు సోమవారం ప్రకటించాడు. తన వయసు పైబడటంతో క్రికెట్ కెరీర్కు వీడ్కోలు చెబుతున్నట్లు 34 ఏళ్ల షాన్ టెయిట్ తెలిపాడు.
' నిజాయితీగా చెప్పాలంటే నేను ఇంకా కొన్ని సంవత్సరాలు క్రికెట్ ఆడాలనుకున్నా. ఇక్కడ(ఆస్ట్రేలియా)లో కానీ, యూకేలో కానీ క్రికెట్ కెరీర్ ను కొనసాగించాలనుకున్నా. అయితే ప్రస్తుతం క్రికెట్ లో పోటీ తత్వం బాగా పెరిగింది. యువ క్రికెటర్లు చాలా మందే వచ్చారు. వారితో పోటీ పడటం కాస్త కష్టంగానే ఉంది. అందుచేత క్రికెట్ కెరీర్ కు ముగింపు పలకాలనుకున్నా'అని టెయిట్ తెలిపాడు.
2016-17 సీజన్ లో భాగంగా బిగ్ బాష్ లీగ్ లో హోబార్ట్ హరికేన్స్ తరపున ఆడిన టెయిట్.. చివరిసారి సిడ్నీ థండర్ తో జరిగిన మ్యాచ్ లో కనిపించాడు. ఇదిలా ఉంచితే భారత్ తో సిడ్నీలో జరిగిన ట్వంటీ 20 మ్యాచ్ అతనికి ఆస్ట్రేలియా తరపున ఆఖరి మ్యాచ్. 2005లో ఇంగ్లండ్ తో జరిగిన యాషెస్ సిరీస్ తో టెయిట్ తన అంతర్జాతీయ కెరీర్ ను ఆరంభించాడు. అయితే తన టెస్టు కెరీర్ లో మూడు మ్యాచ్ లను మాత్రమే టెయిట్ ఆడాడు. కాగా, టెయిట్ వన్డే కెరీర్ మాత్రం ఆశాజనకంగానే సాగింది. తన వన్డే కెరీర్ లో 35 మ్యాచ్ లు ఆడి 62 వికెట్లు తీశాడు. 2007 వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో టెయిట్ ది కీలక పాత్ర. ఆ వరల్డ్ కప్ 11 మ్యాచ్ ల్లో 23 వికెట్లు సాధించి టోర్నమెంట్ లో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు.ఇదిలా ఉండగా, 2010లో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో 161.1 కి.మీ వేగంతో ఫాస్టెస్ బంతిని వేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు.