టెన్నిస్ నుంచి క్రికెట్‌కు మారిన భామ
బిగ్‌బాష్ ఆడుతున్న యాష్లీ బార్టీ
బ్రిస్బేన్: వయసు జస్ట్ 19 ఏళ్లు... 2011లో జూనియర్ వింబుల్డన్ సింగిల్స్ విజేత. ఆ తర్వాత రెండేళ్లకే సీనియర్ విభాగంలో మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో కూడా డబుల్స్ రన్నరప్. వరల్డ్ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా 12వ స్థానానికి కూడా చేరింది. ఇదీ ఆస్ట్రేలియన్ టెన్నిస్ ప్లేయర్ యాష్లీ బార్టీ డబ్ల్యూటీఏ కెరీర్ రికార్డు. గ్లామర్, ఆదాయం కలగలిసి మరి కొన్నేళ్లు టెన్నిస్‌లో వెలిగే అవకాశం. కానీ ఈ టీనేజర్‌ను ‘ఒంటరితనం’ వేధించింది. నాకీ ఆట నచ్చడం లేదు. ఏదైనా టీమ్ గేమ్ ఆడతా అనే ఒట్టేసింది. అంతే... రాకెట్‌ను వదలి క్రికెట్ బ్యాట్ పట్టింది. ఇప్పుడు మహిళల టి20 టోర్నీ బిగ్‌బాష్ లీగ్‌లోకి అడుగు పెట్టింది.
మెరుపు ఆరంభం...
నాలుగేళ్ల వయసులో టెన్నిస్‌లోకి అడుగు పెట్టిన బార్టీ జూనియర్ స్థాయిలో ఆస్ట్రేలియాలో పలు సంచలన విజయాలు సాధించింది. వింబుల్డన్ విజయంతో ఆమె ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించింది. సీనియర్ స్థాయిలో సింగిల్స్‌లో గొప్పగా రాణించకపోయినా... డబుల్స్‌లో మాత్రం మంచి ప్రదర్శన కనబర్చింది. 2013లో ఏకంగా మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో ఆమె ఫైనల్ చేరింది. సహచర ఆస్ట్రేలియా క్రీడాకారిణి కేసీ డెలాక్వాతో కలిసి ఆస్ట్రేలియన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్‌లలో రన్నరప్‌గా నిలిచింది. అయితే గత ఏడాది అనూహ్యంగా టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పింది. ‘వ్యక్తిగత క్రీడల్లో ఉండే ఒత్తిడితో పోలిస్తే టీమ్ గేమ్ బాగుంటుందనిపించింది. మైదానంలో ఏదైనా ఇబ్బంది ఎదురైతే ఒంటరితనం కనిపించదు. మరో పది మంది అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉంటారు. అందుకే క్రికెట్ ఆడాలనిపించింది’ అని ఆమె చెప్పుకొచ్చింది. రాకెట్ పడేయగానే క్వీన్స్‌లాండ్ జట్టు క్రికెట్ కోచ్ ఆండీ రిచర్డ్స్‌ను సంప్రదించింది. ఆమెలో క్రికెటర్‌కు కావాల్సిన ప్రాథమిక లక్షణాలు ఉన్నాయని గుర్తించిన కోచ్ బార్టీని తీర్చిదిద్దారు.
ఇటీవలే ఆమె క్వీన్స్‌లాండ్ తరఫున పోటీ క్రికెట్‌లో అడుగు పెట్టింది. అయితే అసలు మలుపు మహిళల బిగ్‌బాష్ లీగ్‌తో వచ్చింది. యాష్లీ ఆటతో సంతృప్తి చెందిన బ్రిస్బేన్ హీట్స్ జట్టు ఆమెకు కాంట్రాక్ట్ ఇచ్చింది. తొలి మ్యాచ్‌లోనే బార్టీ 27 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 39 పరుగులు చేయడం విశేషం! మున్ముందు కూడా ఈ యువ క్రీడాకారిణి ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. గతంలోనూ ఆస్ట్రేలియాకే చెందిన ఎలిస్ పెర్రీకి కూడా క్రికెట్, ఫుట్‌బాల్‌లలో తమ దేశం తరఫున ప్రపంచ కప్ టోర్నీలలో పాల్గొన్న రికార్డు ఉంది. ఆమె రెండూ టీమ్ గేమ్‌లే ఆడగా బార్టీ నేపథ్యం కాస్త భిన్నం.
‘బంతి మారింది’
Published Mon, Dec 14 2015 2:25 AM | Last Updated on Sun, Sep 3 2017 1:57 PM
Advertisement
Advertisement