భళా బార్టీ... 44 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్
స్వదేశీ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు యాష్లే బార్టీ తెరదించింది. సొంతగడ్డపై ఆద్యంతం అద్వితీయ ఆటతీరు కనబరిచింది. ఫలితంగా 44 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ సాధించిన ఆసీస్ క్రీడా కారిణిగా బార్టీ గుర్తింపు పొందింది. 1978లో చివరిసారి ఆస్ట్రేలియా తరఫున ఈ టైటిల్ గెలిచిన ప్లేయర్‌గా క్రిస్టినా ఒనీల్ నిలిచింది. ఆ తర్వాత 1980లో వెండీ టర్న్‌బుల్ ఫైనల్‌కు చేరినా చివరకు ఆమె రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇప్పటికే ఫ్రెంచ్ ఓపెన్ (2019), వింబుల్డన్ ఓపెన్ (2021) గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన బార్టీ యూఎస్ ఓపెన్ టైటిల్ కూడా సాధిస్తే ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ ఘనతను పూర్తి చేసుకుంటుంది.
మెల్బోర్న్: ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ స్థాయి... టాప్ సీడ్ హోదాకు తగ్గ ఆటతీరు ప్రదర్శించిన యాష్లే బార్టీ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో మహిళల సింగిల్స్ చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్ చేరిన తొలిసారే 25 ఏళ్ల బార్టీ ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో విజేతగా నిలిచింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో బార్టీ 87 నిమిషాల్లో 6–3, 7–6 (7/2)తో 27వ సీడ్ డానియెల్ కొలిన్స్ (అమెరికా)పై విజయం సాధించింది. ఈ టోర్నీ మొత్తంలో బార్టీ తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం గమనార్హం. బార్టీ తన కెరీర్లో చేరిన మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ (ఫ్రెంచ్, వింబుల్డన్, ఆస్ట్రేలియన్) విజేతగా నిలువడం విశేషం. మరోవైపు 28 ఏళ్ల కొలిన్స్‌కు కెరీర్లో ఆడిన తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్లో నిరాశ ఎదురైంది. చాంపియన్‌గా నిలిచిన యాష్లే బార్టీకి 28 లక్షల 75 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 15 కోట్ల 9 లక్షలు)... రన్నరప్ కొలిన్స్‌కు 15 లక్షల 75 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 8 కోట్ల 26 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
ఆరో గేమ్‌లో బ్రేక్‌తో...
ఒక్క సెట్ కూడా చేజార్చుకోకుండా ఫైనల్ చేరిన బార్టీ తుది పోరులోనూ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఆరంభంలో ఇద్దరూ తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో స్కోరు 2–2తో సమంగా నిలిచింది. ఐదో గేమ్‌లో బార్టీ సర్వీస్‌ను బ్రేక్ చేసే అవకాశం కొలిన్స్‌కు వచ్చినా సద్వినియోగం చేసుకోలేదు. ఏస్‌తో తన సర్వీస్‌ను నిలబెట్టుకున్న బార్టీ ఆరో గేమ్‌లో కొలిన్స్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 4–2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత బార్టీ రెండుసార్లు తన సర్వీస్‌ను కాపాడుకొని సెట్‌ను గెల్చుకుంది.
వరుసగా నాలుగు గేమ్‌లు గెలిచి...
రెండో సెట్లో కొలిన్స్ చెలరేగి రెండో గేమ్‌లో, ఆరో గేమ్‌లో బార్టీ సర్వీస్‌లను బ్రేక్ చేసి 5–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగు గేమ్‌లు వెనుకబడ్డా బార్టీ కంగారు పడలేదు. పట్టువిడవకుండా పోరాడి వరుసగా నాలుగు గేమ్‌లు సాధించి స్కోరును 5–5తో సమం చేసింది. ఆ తర్వాత 11వ గేమ్‌లో కొలిన్స్, 12వ గేమ్‌లో బార్టీ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో స్కోరు 6–6తో సమమైంది. టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో బార్టీ పైచేయి సాధించింది. ఫోర్‌హ్యాండ్ విన్నర్‌తో సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకొని బార్టీ విజయగర్జన చేసింది.
నేడు పురుషుల సింగిల్స్ ఫైనల్
మెద్వెదెవ్ (రష్యా) గీ రాఫెల్ నాదల్ (స్పెయిన్)
మధ్యాహ్నం గం. 2:00 నుంచి
సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
2:నలుగురు అమెరికా క్రీడాకారిణులు అనిసిమోవా, జెస్సికా పెగూలా, మాడిసన్ కీస్, కొలిన్స్లను ఓడించి యాష్లే బార్టీ గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా నిలువడం ఇది రెండోసారి. 2019 ఫ్రెంచ్ ఓపెన్‌లో విజేతగా నిలిచే క్రమంలో బార్టీ ఈ నలుగురినే ఓడించడం విశేషం.
7:ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన ఏడో క్రీడాకారిణి బార్టీ. గతంలో స్టెఫీ గ్రాఫ్ (1988, 1989, 1994), మేరీ పియర్స్ (1995), మార్టినా హింగిస్ (1997), లిండ్సే డావెన్‌పోర్ట్ (2000), షరపోవా (2008), సెరెనా (2017) ఈ ఘనత సాధించారు.
8:ఓపెన్ శకంలో (1968 నుంచి) ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఎనిమిదో క్రీడాకారిణిగా బార్టీ నిలిచింది.
అంతా కలలా అనిపిస్తోంది. ఈ గెలుపుతో నా స్వప్నం సాకారమైంది. నా అనుభూతిని మాటల్లో వర్ణించలేను. ఆస్ట్రేలియా పౌరురాలు అయినందుకు గర్వపడుతున్నాను. సొంత ప్రేక్షకుల నడుమ ఆడటం ఎంతో ఆనందాన్నిచ్చింది. నా అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శంచడానికి అభిమానుల మద్దతు కూడా కారణం. హార్డ్ కోర్టు, మట్టి కోర్టు, పచ్చిక కోర్టులపై మూడు వేర్వేరు గ్రాండ్‌స్లామ్ టోర్నీలు గెలిచినా నా కెరీర్లో ఇంకా సాధించాల్సింది ఎంతో ఉంది.
–యాష్లే బార్టీ