
శిఖర్ ధావన్ సెంచరీ
గాలే: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆటగాడు శిఖర్ ధావన్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 178 బంతులు ఎదుర్కొన్న శిఖర్ ధావన్.. 10 ఫోర్ల సాయంతో సెంచరీ మార్కును చేరాడు. దీంతో శిఖర్ టెస్టుల్లో నాలుగో సెంచరీ నమోదు చేశాడు. ప్రస్తుతం శిఖర్ (102)కు జతగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ(72) క్రీజ్ లో ఉన్నాడు. 128/2 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా తడబడకుండా ఆటను కొనసాగిస్తోంది.
శిఖర్, విరాట్ లు రాణించడంతో టీమిండియా లంచ్ లోపే మరో వికెట్ పడకుండా 208 పరుగులు చేసింది. దీంతో టీమిండియాకు 25 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఈ రోజు పూర్తిగా టీమిండియా ఆటను కొనసాగిస్తే శ్రీలంక ముందు భారీ స్కోరు ఉంచే అవకాశం ఉంది. తొలి రోజు ఆటలో శ్రీలంక 183 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. టీమిండియా స్పిన్నర్ అశ్విన్ ఆరు వికెట్లు తీసి శ్రీలంకను చావు దెబ్బతీశాడు.