ధవన్ కు ఏమైంది?
కోల్‌కతా: ఇంగ్లండ్ తో ఆదివారం జరిగే మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్ ఆడతాడా?లేదా?అనే దానిపై సందిగ్థత నెలకొంది. మూడో వన్డేలో భాగంగా భారత జట్టుతో పాటు నగరానికి వచ్చిన ధవన్.. నేరుగా స్థానిక ఆస్పత్రికి వెళ్లాడు. శుక్రవారం అంతర్జాతీయ విమానాశ్రాయానికి చేరుకున్న వెంటనే కోల్ కతాలోని అపోలో గ్లెన్ ఈగల్స్ హాస్పిటల్స్ కు ధవన్ వెళ్లాడు. దాంతో అతని గాయం తిరగబెట్టిందనే అనుమానాలు బలపడుతున్నాయి. గతంలో న్యూజిలాండ్ తో సిరీస్ లో ధవన్ కు తీవ్ర గాయమైంది. ప్రస్తుతం ధవన్ తమ వద్దే ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
శిఖర్ కు గాయం కావడంతో ఆస్పత్రికి వచ్చాడా?.. లేక సాధారణ పరీక్షల కోసం వచ్చాడా అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. అయితే ఆదివారం నాటి వన్డేకు ధవన్ అందుబాటులో ఉంటాడనేది జట్టు వర్గాల సమాచారం.ఇదిలా ఉంచితే ఇప్పటికే భారత జట్టు సిరీస్ ను గెలిచిన నేపథ్యంలో శిఖర్ కు విశ్రాంతినిచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇటీవల కాలంలో ధవన్ ఆశించిన స్థాయి ప్రదర్శన చేయడంలో విఫలమవుతున్నాడు. ఒకవైపు యువ క్రికెటర్లు సత్తా చాటుకుంటూ ఉంటే స్టార్ ఓపెనర్ గా పేరున్న ధవన్ మాత్రం పేలవమైన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. తొలి వన్డేలో ఒక పరుగు, రెండో వన్డేలో 11 పరుగులు చేసి నిరాశపరిచాడు.