
సెహ్వాగ్‌లాగే శిఖర్!
గతంలో సెహ్వాగ్ భారత జట్టుకు ఎలా ఆడాడో ఇకపై ఆ పాత్రను ధావన్ పోషించగలడు. ఒక్క సెషన్‌లోనే మ్యాచ్ ఫలితాన్ని మార్చగల సత్తా అతనికి ఉంది. టెస్టుల్లోనూ రిజర్వ్ డేను ప్రయత్నించవచ్చు. ఫలితం వస్తుందనుకుంటే మరో రోజు ఆటను పొడిగించాలనే ఆలోచన మంచిదే. వర్షం వల్ల మాకు ఎక్కువ సమయం లేదని తెలుసు. స్వార్థం లేకుండా వేగంగా ఆడేందుకు మా బ్యాట్స్‌మెన్ ప్రయత్నించడం అభినందించాల్సిన విషయం. ఐదు రోజులూ మొత్తం మ్యాచ్ జరిగితే బాగుండేది.
అయితే మైదానంలో ఉన్నంత సేపు కుర్రాళ్లు పూర్తి సామర్థ్యంతో ఆడారు. ఇన్ని విరామాల తర్వాత అదే జోరు కొనసాగించడం అంత సులువు కాదు. హర్భజన్, అశ్విన్‌ల ప్రదర్శన కూడా కెప్టెన్‌గా సంతృప్తినిచ్చింది. వీరిద్దరు ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచగలిగారు. నా దృష్టిలో సరైన జట్టునే ఎంపిక చేసుకున్నాం. వాతావరణం బాగుంటే మా వ్యూహాలు బాగా పని చేసేవి.
-విరాట్ కోహ్లి, భారత కెప్టెన్
బాగా ఆడాల్సింది...
మా ప్రదర్శన మరింత మెరుగ్గా ఉండాల్సింది. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లాగే మేం కూడా భారీ స్కోర్లు చేయాలనే కోరుకున్నాం. కానీ అశ్విన్ బౌలింగ్ వల్ల అది సాధ్యం కాలేదు. పిచ్ పేసర్లకు పెద్దగా అనుకూలంగా లేదు. పైగా కనీసం 140 కి.మీ.కు పైగా వేగంతో బంతులు విసిరే బౌలర్ మా జట్టులో లేకపోవడం వల్లే ఒకే పేసర్‌తో బరిలోకి దిగాం. దీనిపై చర్చ అనవసరం. వన్డేల్లో రాణించాలని పట్టుదలగా ఉన్నాం.
-ముష్ఫికర్ రహీమ్, బంగ్లాదేశ్ కెప్టెన్
భజ్జీతో పోటీ లేదు...
నా కెరీర్‌లో ఇదో అత్యుత్తమ దశ. చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాను. అయితే నేర్చుకోవడం నిరంతరం కొనసాగుతుంది. వచ్చేసారి ఇంతకంటే బాగా ఆడతానేమో. గతంతో పోలిస్తే కూకాబుర్రా బంతితో నేను మరింత మెరుగ్గా బంతులు విసరగలుగుతున్నాను. భజ్జీతో పోటీ గురించి ఆలోచించను. మ్యాచ్‌లో నేను బాగా బౌలింగ్ చేయడంపై నే దృష్టి.
-అశ్విన్ (5/87)
ఏకాగ్రత కోల్పోకుండా...
నా బ్యాటింగ్‌ను ఆస్వాదించాను. వికెట్ చాలా అనుకూలంగా అనిపించింది. మరో ఎండ్‌లో విజయ్‌లాంటి బ్యాట్స్‌మన్ ఉన్నప్పుడు మనం స్వేచ్ఛగా ఆడవచ్చు. వర్షం ఆగిన తర్వాత మళ్లీ నిలదొక్కుకునేందుకు కొన్ని బంతులు అవసరమయ్యాయి. అయితే వానపై అతిగా దృష్టి పెట్టి ఏకాగ్రత కోల్పోలేదు.
-శిఖర్ ధావన్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్