కేఎల్ రాహుల్ అవుట్!
న్యూఢిల్లీ:రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10వ సీజన్ నుంచి వైదొలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియాతో సిరీస్లో రాహుల్ ఎడమ భుజానికి గాయమైంది. అయితే ఆ సిరీస్లో రాహుల్ యథావిధిగా పాల్గొని ఆరు హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నాడు. దాంతో పాటు ఆ సిరీస్ లో మూడో అత్యధిక స్కోరర్ గా నిలిచాడు. ఆ గాయం తీవ్రత ఎక్కువ కాకుండా చూసుకునేందుకు రాహుల్ చికిత్స నిమిత్తం లండన్ కు వెళ్లే అవకాశం ఉంది. ఆ క్రమంలోనే ఐపీఎల్-10 సీజన్ లో రాహుల్ పాల్గొనే అవకాశాలు దాదాపు లేనట్లేనని సమాచారం.
ఒకవేళ రాహుల్ గనుక ఐపీఎల్ నుంచి వైదొలిగితే మాత్రం అది ఆర్సీబీకి గట్టి ఎదురుదెబ్బగానే చెప్పొచ్చు. ఇప్పటికే ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా భుజం గాయంతో బాధపడుతున్నాడు. ఆసీస్ తో రాంచీలో జరిగిన మూడో టెస్టులో కోహ్లి ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. ఇంకా విరాట్ పూర్తిగా గాయం నుంచి కోలుకోకపోవడంతో ఆర్సీబీ ఆరంభపు మ్యాచ్ల్లో పాల్గోనే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.