సే‘యస్‌’ అయ్యర్‌ | Shreyas Iyer Ended Discussion For on India's Number Four | Sakshi
Sakshi News home page

సే‘యస్‌’ అయ్యర్‌

Published Thu, Feb 13 2020 2:53 PM | Last Updated on Thu, Feb 13 2020 4:37 PM

Shreyas Iyer Ended Discussion For on India's Number Four - Sakshi

న్యూఢిల్లీ: గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా సెమీస్‌లో పరాజయం చెందడానికి అటు టాపార్డర్‌తో పాటు మిడిల్‌ ఆర్డర్‌ కూడా కారణం.  ఆ సెమీస్‌లో న్యూజిలాండ్‌ నిర్దేశించిన 240 పరుగుల సాధారణ లక్ష్యాన్ని భారత్‌  ఛేదించడంలో విఫలమై తన పోరును తుది వరకూ తీసుకెళ్లకుండానే ముగించేసింది. అప్పటివరకూ టాపార్డర్‌లో ఓపెనర్లు పరుగుల మోత మోగించడంతో మిడిల్‌ ఆర్డర్‌ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు టీమిండియా. అయితే అసలు సిసలైన నాకౌట్‌ పోరులో భారత్‌ ఓపెనర్లు నిరాశపరచగా, ఫస్ట్‌ డౌన్‌లో వచ్చిన విరాట్‌ కోహ్లి కూడా నిరాశపరిచాడు. రాహుల్‌, రోహిత్‌, కోహ్లిలు తలో పరుగు చేసి పెవిలియన్‌ చేరడంతో అప్పుడు మిడిల్‌ ఆర్డర్‌పై పడింది టీమిండియా భారం. కానీ ధోని, జడేజాల పోరుతో కడవరకూ నెట్టుకొచ్చినా భారత్‌ మాత్రం విజయాన్ని అందుకోలేకపోయింది. అప్పుడే భారత్‌కు తెలుసొచ్చినట్లుందు నాల్గో స్థానం విలువ. ఆ తర్వాత తనకు వచ్చిన అవకాశంతో నాల్గో స్థానానికి ముగింపు ఇచ్చాడు శ్రేయస్‌ అయ్యర్‌.

మంచి ఇన్నింగ్స్‌ను నిర్మించడానికి ఓపెన్లర్లు ఎంత ప్రధానమో.. మిడిల్‌ ఆర్డర్‌కు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ఓపెనర్లు సక్సెస్‌ అయితే మిడిల్‌ ఆర్డర్‌ ఆటగాళ్లు బ్యాట్‌ ఝుళిపించడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడే స్కోరు బోర్డుపై భారీ పరుగుల్ని ఉంచడానికి వీలుంటుంది. ప్రతీసారి ఓపెనర్లు విజయవంతం అవుతారనుకోవడం పొరపాటు. అప్పుడు మిడిల్‌ ఆర్డర్‌ విలువ తెలుస్తుంది. మిడిల్‌ ఆర్డర్‌లో వచ్చే ఆటగాడు పిచ్‌ పరిస్థితుల్ని అర్ధం చేసుకుంటూ ముందుకు సాగాలి. ప్రధానంగా ఇక్కడ నాల్గో స్థానానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇద్దరు ఓపెనర్లు విఫలమయ్యారంటే కచ్చితంగా నాల్గో స్థానంలో వచ్చే ఆటగాడు ఎంతో సమయ స్ఫూర్తితో ఆడాలి. పిచ్‌ పరిస్థితిని అర్ధం చేసుకోవడంతో పాటు బౌలర్ల వేసే బంతుల్ని కూడా అంచనా వేయగలగాలి. అదే సమయంలో ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు సాధిస్తున్నాం అనే దానిపై కూడా దృష్టి పెట్టి వికెట్‌ను కాపాడుకుంటూ జట్టును నడిపించాలి. అప్పుడు ప్రత్యర్థి జట్టుకు సవాల్‌ విసిరే అవకాశం మెండుగా ఉంటుంది. చాలా కాలం తర్వాత టీమిండియాకు నాల్గో స్థానంలో సరిపోయే ఆటగాడు అయ్యర్‌ రూపంలో దొరికాడనే చెప్పాలి. 

వరల్డ్‌కప్‌ సమయంలో అంబటి రాయుడి నాల్గో స్థానంపై భరోసా కల్పించిన సెలక్టర్లు, కెప్టెన్‌ కోహ్లిలు ఆ తర్వాత అతనికి మొండిచేయి చూపించారు. వరల్డ్‌కప్‌ నుంచి ఇద్దరు ఆటగాళ్లు గాయాలతో ఇంటికి వచ్చేసినా రాయుడికి అవకాశం ఇవ్వలేదు. అంతకుముందు కూడా నాల్గో స్థానంలో రాయుడికి వరుసగా అవకాశాలు ఇచ్చిన సందర్భాలు తక్కువ. ఒక మ్యాచ్‌లో అవకాశం ఇస్తే మరొక మ్యాచ్‌లో పక్కన కూర్చొబెట్టడం జరుగుతూ వచ్చింది. అయితే ఆ వరల్డ్‌కప్‌ నుంచి టీమిండియా నేర్చుకున్న గుణపాఠం ఏదైనా ఉందంటే నాల్గో స్థానంపై ఫోకస్‌. దాంతోనే శ్రేయస్‌ అయ్యర్‌కు వరుసగా అవకాశాలు ఇస్తూ అదే స్థానంలో పదే పదే పరీక్షిస్తూ వస్తున్నారు. ఇది మంచి ఫలితాన్ని ఇచ్చింది .ఈ స్థానంలో అయ‍్యర్‌ తన పాత్రకు న్యాయం చేస్తూ జట్టు మేనేజ్‌మెంట్‌ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు. 

ఇప్పటివరకూ అయ్యర్‌ ఆడిన వన్డేలు 18 కాగా, 22 అంతర్జాతీయ టీ20లు ఆడాడు.  అయితే 40 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉ‍న్న  అయ్యర్‌ 3,4,5,6 స్థానాల్లో బ్యాటింగ్‌ చేశాడు.కాగా, నాల్గో స్థానంలోనే అతని సగటు మెరుగ్గా ఉందనే విషయం గణాంకాలే చెబుతున్నాయి.  వన్డే ఫార్మాట్‌లో ఫస్ట్‌ డౌన్‌(మూడో స్థానంలో) మూడు ఇన్నింగ్స్‌లు ఆడి 162 పరుగులు చేసిన అయ్యర్‌ సగటు 54.00 గా ఉంది. ఇక సెకండ్‌ డౌన్‌(నాల్గో స్థానంలో) అయ్యర్‌ ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో 396 పరుగులు నమోదు చేశాడు. ఇక్కడ అయ్యర్‌ సగటు 56.00కు పైగానే ఉంది.  ఇక ఐదో స్థానంలో సుమారు 37 సగటుతో 188 పరుగులు చేశాడు. ప్రతీ స్థానంలోనూ రెండేసి అర్ధ సెంచరీలు చొప్పున చేసిన అయ్యర్‌.. నాల్గో స్థానంలో మెరుగ్గా ఉన్నాడు. తనకు ఎంతో ఇష్టమైన నాల్గో స్థానంలోనే తొలి వన్డే సెంచరీ కూడా చేశాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో శతకంతో మెరిశాడు. ఆ తర్వాత మిగతా రెండు వన్డేల్లో ఇదే స్థానంలో బరిలోకి దిగి 52, 62 పరుగులతో ఆకట్టుకున్నాడు. 

ఇక టీ20ల్లో కూడా అయ్యర్‌ నాల్గో స్థానం సగటు యాభై ఉండటం విశేషం.  ఈ స్థానంలో 8 ఇన్నింగ్స్‌లు 50 సగటుతో 250 పరుగులు సాధించాడు. న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో అజేయంగా 58 పరుగులు చేసిన అయ్యర్‌.. రెండో టీ20లో 44 పరుగులతో మెరిశాడు. ఇక​ మూడో టీ20లో ఐదో స్థానంలో దిగి 17 పరుగులు చేసిన అయ్యర్‌.. నాల్గో టీ20 నాల్గో స్థానంలో పరుగు మాత్రమే చేశాడు. చివరి టీ20లో అయ్యర్‌ నాల్గో స్థానంలో దిగి అజేయంగా 33 పరుగులు సాధించాడు. ఎలా చూసినా టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అయ్యర్‌ నాల్గో స్థానానికి భరోసా కల్పించాడనడానికి అతనే గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి.  గత కొన్నేళ్లుగా నాల్గో స్థానంపై టీమిండియా డజనుకు పైగా క్రికెటర్లను పరిశీలించింది. విజయ్‌ శంకర్‌, కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌, మనీష్‌ పాండే, దినేశ్‌ కార్తీక్‌లను పరిశీలించినా వారు ఇక్కడ సఫలం కాలేదు. ఇన్నాళ్లకు అయ్యర్‌ రూపంలో నాల్గో స్థానంపై నమ్మకం కుదురడంతో టీమిండియా మేనేజ్‌మెంట్‌ బెంగ తీరింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నాల్గో స్థానంపై చర్చకు ముగింపు దొరకడంతో మనం కూడా సే యస్‌ అయ్యర్‌ అని అనక తప్పదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement