
భారత యువ బ్యాట్స్‌మన్ శ్రేయర్ అయ్యర్‌పై న్యూజిలాండ్ మాజీ వికెట్ కీపర్ ఇయాన్ స్మిత్ ప్రశంసలు కురిపించాడు.
ఆక్లాండ్: భారత యువ బ్యాట్స్‌మన్ శ్రేయర్ అయ్యర్‌పై న్యూజిలాండ్ మాజీ వికెట్ కీపర్ ఇయాన్ స్మిత్ ప్రశంసలు కురిపించాడు. మరో సూపర్‌స్టార్ వచ్చాడంటూ కితాబిచ్చాడు. శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టి20లో అయ్యర్ అద్భుతంగా ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 29 బంతుల్లోనే అర్ధసెంచరీ బాది ఓవర్ మిగిలివుండగానే విజయాన్ని అందించాడు. టిమ్ సౌతీ బౌలింగ్‌లో భారీ సిక్సర్ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. అదే సమయంలో కామెంటరీ బ్యాక్స్‌లో ఉన్న ఇయాన్ స్మిత్.. అయ్యర్ ఆటతీరును పొగిడాడు. ‘న్యూజిలాండ్ తీరంలోకి మరో సూపర్ స్టార్ (శ్రేయస్ అయ్యర్) రావడం మేమంతా చూశాం. గొప్ప ఇన్నింగ్స్, టీమిండియా ఛేజింగ్ చేసిన తీరు ఎంతోగానే ఆకట్టుకుంది. మనీష్ పాండే కూడా తనవంతు పాత్ర పోషించాడ’ని ఇయాన్ స్మిత్ వ్యాఖ్యానించాడు.
‘మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్న తర్వాత అయ్యర్ మాట్లాడుతూ.. విదేశీ గడ్డపై మ్యాచ్ గెలవడం సంతోషంగా ఉందన్నాడు. అజేయంగా నిలిచి మ్యాచ్‌ను ముగించడం తనకు ప్రత్యేకంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ‘మేము త్వరగా వికెట్లు కోల్పోవడంతో ముందుగా మంచి భాగస్వామ్యాన్ని నిర్మించాం. ఆక్లాండ్ మైదానం చిన్నది కాబట్టి ఎక్కువ పరుగులు సాధించగలమని మాకు తెలుసు. ఇదేవిధంగా మిగతా మ్యాచ్‌ల్లోనూ రాణించాలని కోరుకుంటున్నామ’ని అన్నాడు. (చదవండి: అయ్యర్ అదరహో..)