ముంబై... 41వ సారి
రంజీ ట్రోఫీ సొంతం
ఫైనల్లో సౌరాష్ట్రపై విజయం
పుణే: రంజీ ట్రోఫీలో ముంబై జట్టు తన ఆధిపత్యాన్ని మరోసారి చూపెట్టింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతూ రికార్డు స్థాయిలో 41వ సారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. మూడు రోజుల్లోనే ముగిసిన ఫైనల్లో ముంబై ఇన్నింగ్స్ 21 పరుగుల తేడాతో సౌరాష్ట్రపై విజయం సాధించింది. గత మూడు సీజన్లలో నిరాశజనక ప్రదర్శనతో విఫలమైన ముంబై ఈసారి మాత్రం అన్ని రంగాల్లో ఆకట్టుకుంది. ఇప్పటి వరకు ఆడిన 45 ఫైనల్స్‌లో 41సార్లు విజేతగా నిలిచిన ముంబై... 10సార్లు ఇన్నింగ్స్ తేడాతో నెగ్గడం విశేషం.
2012-13 ఫైనల్‌ను తలపించే రీతిలో సాగిన ఈ మ్యాచ్‌లో శుక్రవారం మూడోరోజు ముంబై బౌలర్లు మ్యాజిక్ చూపెట్టారు. కీలక సమయంలో ఒత్తిడి పెంచుతూ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను చకచకా అవుట్ చేశారు. దీంతో సౌరాష్ట్ర రెండో ఇన్నింగ్స్‌లో 48.2 ఓవర్లలోనే 115 పరుగులకే కుప్పకూలింది. చతేశ్వర్ పుజారా (27) టాప్ స్కోరర్. టాప్ ఆర్డర్‌లో బరోత్ (4), జోగియాని (9) తక్కువ స్కోరుకే అవుట్‌కావడంతో ఓ దశలో సౌరాష్ట్ర 67 పరుగులకే సగం జట్టు పెవిలియన్‌కు చేరుకుంది. తర్వాత కూడా ముంబై బౌలర్ల జోరు కొనసాగడంతో జైదేవ్ షా బృందం కోలుకోలేకపోయింది.
ఓవరాల్‌గా 48 పరుగుల తేడాతో చివరి ఐదు వికెట్లు చేజార్చుకుంది. శార్దూల్ ఠాకూర్ 5, ధవల్ కులకర్ణి, బల్విందర్ సంధూ చెరో రెండు వికెట్లు తీశారు. అంతకుముందు 262/8 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 82.2 ఓవర్లలో 371 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ సిద్ధేశ్ లాడ్ (88), బల్విందర్ సంధూ (34 నాటౌట్) రాణించారు. ఇక్బాల్ అబ్దుల్లా (15) తొందరగా అవుటైనా... లాడ్, సంధూ పదో వికెట్‌కు 103 పరుగులు జోడించి ముంబైకి భారీ ఆధిక్యాన్ని (136 పరుగులు) అందించారు. ఉనాద్కట్ 4, రాథోడ్ 3 వికెట్లు పడగొట్టారు. శ్రేయస్ అయ్యర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.