
సాగనీ.. ఈ దూకుడు..
భారత బ్యాడ్మింటన్ తేజం పారుపల్లి కశ్యప్.. సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ లో దూకుడు కొనసాగిస్తున్నాడు.
భారత బ్యాడ్మింటన్ తేజం పారుపల్లి కశ్యప్.. సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ లో దూకుడు కొనసాగిస్తున్నాడు.మెన్స్ సింగిల్స్ విభాగంలో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్లో ఫ్రాన్స్ క్రీడాకారుడు బ్రైస్ లెవెర్‌డెజ్ను 21- 6, 21- 17 తేడాతో చిత్తుగా ఓడించి సెమీస్లోకి దూసుకెళ్లాడు.
ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో ప్రపంచ ఐదో ర్యాంకర్ సన్ వాన్ హూ (దక్షిణ కొరియా)ను బోల్తా కొట్టించిన కశ్యప్.. అదే జోరులో లెవెర్‌డెజ్నూ మట్టికరిపించాడు. శనివారం జరిగే సెమీస్లో హాంకాంగ్ షెట్లర్ హు యున్ను ఢీకనబోతున్నాడు.
మరో క్వార్టర్ ఫైనల్స్లో ఎడమకాలికి గాయంతో బరిలోకి దిగిన హెచ్ఎస్ ప్రణయ్.. జపనీస్ ప్లేయర్ కెంటో మెమొటా చేతిలో ఓటమిపాలయ్యాడు. గాయం బాధపెడుతున్నప్పటికీ రెండో రౌండ్లో కెంటోపై పైచేయి సాధించిన ప్రణయ్.. చివరి వరకు పోరాడలేకపోయాడు. ఈ ఓటమితో కశ్యప్ మినహా సింగపూర్ సూపర్ సిరీస్లో మిగతా భారత ఆటగాళ్ల ప్రస్తానం ముగిసినట్లే.