రజత 'వికాసం'
గత మూడు రోజులుగా ఇంచియాన్‌లో ‘పసిడి' కాంతులు విరజిమ్మిన భారత క్రీడాకారులు మంగళవారం మాత్రం రజతానందాన్ని కలిగించారు. మొత్తానికి 11వ రోజు ఏషియాడ్‌లో నాలుగు పతకాలతో భారత ప్రదర్శన కొంచెం మోదం... కొంచెం ఖేదంలా సాగింది. డిస్కస్ త్రోలో కచ్చితంగా స్వర్ణం సాధిస్తాడని భావించిన వికాస్ గౌడ రజతంతో సరిపెట్టుకున్నాడు. ఇక బాక్సింగ్‌లో మిశ్రమ ఫలితాలు లభించాయి. మేరీకోమ్ మెరిపించి ఫైనల్‌కు చేరగా.. సరితా దేవి, పూజా రాణి సెమీఫైనల్లో ఓటమిపాలై కాంస్య పతకాలతో సంతృప్తి పడ్డారు. వికాస్ కృషన్, సతీశ్ కుమార్ సెమీఫైనల్‌కు చేరి కనీసం కాంస్యాలు ఖాయం చేయగా... దేవేంద్రో సింగ్, శివ థాపా క్వార్టర్ ఫైనల్లో ఓటమి చవిచూశారు. ఎవరూ ఊహించని విధంగా సెయిలింగ్‌లో వర్ష, ఐశ్వర్య ద్వయం కాంస్యం నెగ్గి ఆశ్చర్యపరిచింది.
ఇంచియాన్: తన చిరకాల ప్రత్యర్థి చేతిలో మళ్లీ ఓడిపోయిన భారత స్టార్ డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ ఆసియా క్రీడల్లో రజత పతకంతో సంతృప్తి పడ్డాడు. మంగళవారం జరిగిన పురుషుల డిస్కస్ త్రో ఫైనల్లో వికాస్ గౌడ రెండో స్థానంలో నిలిచాడు. ఇటీవల గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన వికాస్ అదే ప్రదర్శనను ఆసియా క్రీడల్లో పునరావృతం చేయలేకపోయాడు. ఇరాన్‌కు చెందిన ఎహ్‌సాన్ హదాదీ వరుసగా మూడోసారి స్వర్ణం నెగ్గి ‘హ్యాట్రిక్’ సాధించాడు. 2 కేజీల బరువుండే డిస్క్‌ను హదాదీ 65.11 మీటర్ల దూరం విసరగా... వికాస్ 62.58 మీటర్ల దూరం విసిరి ఆసియా క్రీడల్లో తొలిసారి రజతం కైవసం చేసుకున్నాడు. 2006 దోహా క్రీడల్లో ఆరో స్థానంలో నిలిచిన ఈ కర్ణాటక అథ్లెట్... 2010 గ్వాంగ్‌జౌ క్రీడల్లో మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించాడు. ఇప్పటివరకు హదాదీ, వికాస్ పరస్పరం బరిలోకి దిగిన ఈవెంట్‌లలో ఒక్కసారి మాత్రమే వికాస్ తన ప్రత్యర్థికంటే మెరుగైన ప్రదర్శన చేశాడు. 6 అడుగుల 9 అంగుళాల ఎత్తు, 110 కేజీల బరువున్న వికాస్‌కు ఇంచియాన్ వేదిక మరోసారి రజతానందాన్ని మిగిల్చింది. 2005లో ఇంచియాన్‌లోనే జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ వికాస్‌కు రజతం వచ్చింది. మరోవైపు పురుషుల 110 మీటర్ల హర్డిల్స్ ఫైనల్లో సిద్ధాంత్ 13.73 సెకన్లతో ఆరో స్థానంలో నిలిచాడు.
ఫైనల్స్‌కు ఐదుగురు: అథ్లెటిక్స్‌లో నాలుగు ఈవెంట్స్‌లో ఐదుగురు భారత అథ్లెట్స్ ఫైనల్లోకి ప్రవేశించారు. మహిళల 800 మీటర్లలో టింటూ లూకా, సుష్మా దేవి... మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో అశ్విని అకుంజి, పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో జితిన్ పాల్, పురుషుల 800 మీటర్లలో సాజిష్ జోసెఫ్ ఫైనల్‌కు అర్హత సాధించారు.