ఒలింపిక్స్ కు వికాస్ గౌడ అర్హత
న్యూఢిల్లీ:భారత డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ్ వచ్చే ఏడాది జరుగనున్న రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించాడు. వరల్డ్ అథ్లెటిక్స్ గవర్నింగ్ బాడీ, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్ ఫెడరేషన్ తాజాగా నిబంధనలు సడలించడంతో వికాస్ గౌడకు రియో బెర్తు ఖరారైంది. గత ఏప్రిల్ నిబంధనల ప్రకారం పురుషుల డిస్కస్ త్రోలో కటాఫ్ మార్కును 66.00 మీటర్ల దూరంగా నిర్ణయించారు. కాగా, కొన్ని రోజుల క్రితం ఆ దూరాన్ని 65.00 మీటర్లకు ఐఏఏఎఫ్ కుదిస్తూ నిర్ణయం తీసుకోవడంతో వికాస్ గౌడ అనూహ్యంగా రియోకు అర్హత సాధించాడు.
గత మే నెలలో జరిగిన జమైకా అథ్లెటిక్స్ మీట్ లో వికాస్ గౌడ్ 65.00 మీటర్లకు పైగా డిస్క్ ను విసరడంతో అతనికి ఒలింపిక్స్ కు అర్హత సాధించినట్లు అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ సీకే వాల్సన్ వెల్లడించారు. ఆసియన్ చాంపియన్ అయిన వికాస్ గౌడ 2014 కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే.