అథ్లెటిక్స్‌లో భారీ బృందంతో బరిలోకి దిగిన భారత్‌కు తొలి రోజు కలిసిరాలేదు. పురుషుల డిస్కస్ త్రోలో వికాస్ గౌడ ఓవరాల్‌గా 28వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందలేకపోయాడు. వరుసగా నాలుగో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న వికాస్ డిస్క్‌ను మూడు ప్రయత్నాల్లో అత్యుత్తమంగా 58.99 మీటర్ల దూరం విసిరాడు. ప్రస్తుత ఆసియా చాంపియన్ అయిన వికాస్ భుజం గాయం కారణంగా ఈ ఏడాది ఎలాంటి పోటీల్లో పాల్గొనకుండానే నేరుగా ఒలింపిక్స్‌లో బరిలోకి దిగాడు.
గతంలో డిస్క్‌ను 66.28 మీటర్ల దూరం విసిరి తన పేరిట జాతీయ రికార్డును లిఖించుకున్న వికాస్ ఈ ప్రదర్శన రియోలో పునరావృతం చేసిఉంటే ఫైనల్‌కు అర్హత పొందేవాడు. క్వాలిఫయింగ్ నుంచి 12 మంది ఫైనల్‌కు అర్హత సాధించారు. క్వాలిఫయింగ్‌లో పియోటర్ మాలాచౌస్కీ (పోలాండ్) గరిష్టంగా 65.89 మీటర్ల దూరం... కనిష్టంగా ఫిలిప్ మిలానోవ్ (బెల్జియం) 62.68 మీటర్ల దూరం విసిరి ఫైనల్‌కు చేరుకున్నారు.
మహిళల షాట్‌పుట్ క్వాలిఫయింగ్‌లో మన్‌ప్రీత్ కౌర్ (భారత్) ఇనుప గుండను 17.06 మీటర్ల దూరం విసిరి ఓవరాల్‌గా 23వ స్థానంలో నిలిచింది. పురుషుల 800 మీటర్ల విభాగంలో జిన్సన్ జాన్సన్ (భారత్) హీట్స్‌లోనే వెనుదిరిగాడు. మూడో హీట్‌లో పాల్గొన్న జిన్సన్ జాన్సన్ ఒక నిమిషం 47.27 సెకన్లలో గమ్యానికి చేరి ఐదో స్థానంలో నిలిచాడు.