సాక్షి క్రీడావిభాగం : కొత్త ఏడాదిలో లోటుగా ఉన్న టైటిల్‌ను సాధించాలనే లక్ష్యంతో భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు మరో సమరానికి సిద్ధమైంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నమెంట్‌లో సింధు నేడు తొలి మ్యాచ్ ఆడనుంది. సిడ్నీలో బుధవారం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 56వ ర్యాంకర్, క్వాలిఫయర్ చౌరున్నిసా (ఇండోనేసియా)తో సింధు తలపడనుంది. ముఖాముఖి రికార్డులో సింధు 1–0తో ఆధిక్యంలో ఉంది. ఈ ఏడాదే జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో చౌరున్నిసాతో ఆడిన సింధు వరుస గేముల్లో గెలుపొందింది. ఈ సీజన్‌లో సింధు మొత్తం ఆరు టోర్నమెంట్‌లలో బరిలోకి దిగింది. కానీ ఏ టోర్నమెంట్‌లోనూ ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. 23 ఏళ్ల సింధు ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లో... ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో తొలి రౌండ్‌లో... ఇండియా ఓపెన్‌లో సెమీఫైనల్లో... మలేసియా ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లో... సింగపూర్ ఓపెన్‌లో సెమీఫైనల్లో... ఆసియా చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది.
ఈ ఆరు టోర్నమెంట్‌లలోనూ సింధును వేర్వేరు క్రీడాకారిణులు ఓడించడం గమనార్హం. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న సింధు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనూ అంతగా సులువైన ‘డ్రా’ ఎదురుకాలేదు. తొలి రౌండ్ అడ్డంకిని ఆమె దాటితే ప్రిక్వార్టర్ ఫైనల్లో నిచావోన్ జిందాపోల్ (థాయ్‌లాండ్) లేదా పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్)లలో ఒకరితో ఆడాల్సి ఉంటుంది. ర్యాంకింగ్ పరంగా సింధుకంటే వెనుకలో ఉన్నప్పటికీ థాయ్‌లాండ్ క్రీడాకారిణులు తమదైన రోజున సంచలన ఫలితాలు సాధించే సత్తాగలవారే. ఈ అవరోధాన్ని సింధు అధిగమిస్తే క్వార్టర్ ఫైనల్లో 2012 లండన్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, మాజీ నంబర్‌వన్ లీ జురుయ్ (చైనా) లేదా ప్రపంచ 17వ ర్యాంక్ సయాక తకహాషి (జపాన్) ఎదురయ్యే అవకాశముంది. క్వార్టర్ ఫైనల్‌నూ దాటితే సింధుకు సెమీస్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ చెన్ యుఫె (చైనా) ప్రత్యర్థిగా ఉండవచ్చు. మరో పార్శ్వం నుంచి సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా), టాప్ సీడ్ నొజోమి ఒకుహారా (జపాన్) సెమీఫైనల్ చేరుకునే అవకాశముంది.
పురుషుల సింగిల్స్ విభాగంలో నలుగురు భారత క్రీడాకారులు నేరుగా మెయిన్ ‘డ్రా’లో పోటీపడుతున్నారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో చైనా దిగ్గజం లిన్ డాన్‌తో హెచ్‌ఎస్ ప్రణయ్... సుపన్యు అవింగ్‌సనోన్ (థాయ్‌లాండ్)తో పారుపల్లి కశ్యప్... లీ జి జియా (మలేసియా)తో సమీర్ వర్మ... లీ డాంగ్ కెయున్ (కొరియా)తో భమిడిపాటి సాయిప్రణీత్ ఆడతారు.
Comments
Please login to add a commentAdd a comment