రెండో రౌండ్‌లో సోమ్‌దేవ్
సిడ్నీ: అపియా ఇంటర్నేషనల్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ క్వాలిఫయింగ్ విభాగంలో భారత క్రీడాకారుడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. శనివారం జరిగిన తొలి రౌండ్‌లో సోమ్‌దేవ్ 6-2, 2-6, 6-4తో నీల్ డెసియన్ (బెల్జియం)పై విజయం సాధించాడు.
గతవారం చెన్నై ఓపెన్‌లో అనామక క్రీడాకారుడు రామ్‌కుమార్ చేతిలో అనూహ్య ఓటమి నుంచి తేరుకున్న సోమ్‌దేవ్ మరో రెండు మ్యాచ్‌లు గెలిస్తే మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధిస్తాడు. ఆదివారం జరిగే రెండో రౌండ్‌లో జాన్ లెనార్డ్ స్ట్రఫ్ (జర్మనీ)తో సోమ్‌దేవ్ ఆడుతాడు. సోమవారం మొదలయ్యే మెయిన్ ‘డ్రా’ పోటీల్లో లియాండర్ పేస్ (భారత్)-స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్) జోడి; రోహన్ బోపన్న (భారత్)-ఐజామ్ ఖురేషీ (పాకిస్థాన్) జంట బరిలోకి దిగుతాయి.