సూపర్ సోమ్‌దేవ్
బెంగళూరు: వరుసగా రెండు సింగిల్స్ మ్యాచ్‌లు ఓడి ఒత్తిడి నెలకొన్న దశలోనూ వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్- బోపన్న తమ డబుల్స్ మ్యాచ్‌లో చూపిన పోరాట పటిమ... యువ ఆటగాడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్‌లో స్ఫూర్తిని నింపింది. ఇదే జోరుతో ముందుకెళ్లి తనకన్నా ఎంతో మెరుగైన ఆటగాడిని చిత్తు చేసి వారి శ్రమను వృథాగా పోనీయలేదు. ఫలితంగా డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీలో భాగంగా ఆదివారం జరిగిన తొలి రివర్స్ సింగిల్స్‌లో సోమ్‌దేవ్ 1-6, 6-4, 4-6, 6-4, 6-3 తేడాతో ప్రపంచ 61వ ర్యాంకర్ డూసాన్ లజోవిక్‌ను మట్టికరిపించాడు. 3 గంటల 37 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో అందిన విజయంతో భారత్ 2-2తో సెర్బియా ఆధిక్యాన్ని సమం చేసింది. యూకీ బాంబ్రీ, క్రాజినోవిచ్ మధ్య నిర్ణాయక మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా నిలిచింది. వర్షంతో మ్యాచ్ నిలిచిపోయే సమయానికి క్రాజినోవిచ్ తొలి సెట్‌ను 6-3తో నెగ్గగా... రెండో సెట్‌లో స్కోరు 4-4తో సమంగా ఉంది. ఇదే స్కోరు నుంచి ఈ మ్యాచ్‌ను సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి నిర్వహిస్తారు.
లజోవిక్‌తో తొలి సెట్‌ను 29 నిమిషాల్లోనే చిత్తుగా ఓడిన తర్వాత సోమ్‌దేవ్ అనూహ్యంగా పుంజుకున్నాడు. చురుకైన కదలికలతో పాటు చక్కటి వ్యూహం ప్రకారం రెండో సెట్‌ను ఆడి ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్స్‌కు చేరిన లజోవిక్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఈ సెట్‌లో తను ఎనిమిది బ్రేక్‌పాయింట్లను కాపాడుకున్నాడు. కీలక సమయాల్లో సర్వ్, వ్యాలీ షాట్లతో ప్రత్యర్థిని కోలుకోనీయలేదు. ఈ సెట్ అనంతరం కోర్టులో జారిపడిన లజోవిక్ తన ఎడమ కాలికి చికిత్స తీసుకున్నాడు. దీంతో అతడి ఆటతీరులో వేగం తగ్గింది. ఈ అవకాశాన్ని సోమ్‌దేవ్ సొమ్ము చేసుకోలేకపోయాడు. మూడో సెట్ ఆరో గేమ్‌లో లజోవిక్ సర్వీస్‌ను బ్రేక్ చేసే అవకాశం మూడు సార్లు వచ్చినా సోమ్‌దేవ్ సద్వినియోగం చేసుకోలేదు. తొమ్మిదో గేమ్‌లోనూ ఒక అవకాశాన్ని జారవిడుచుకున్నాడు. తద్వారా 4-1 ఆధిక్యం నుంచి సెట్‌ను కోల్పోవడంతో ప్రేక్షకులు నిరాశపడ్డారు.
సోమ్‌దేవ్ జోష్
నాలుగో సెట్‌లో సోమ్‌దేవ్ ఆట అభిమానుల్లో జోష్‌ను నింపింది. ఈ సెట్ నాలుగో గేమ్‌లో ఇరు ఆటగాళ్ల నుంచి వారు అద్వితీయ ఆటను తిలకించారు. గేమ్‌ను దక్కించుకునేందుకు పట్టువిడవకుండా ఆడడంతో ఆరు సార్లు డ్యూస్‌కు వెళ్లింది. అయితే లజోవిక్ తన బ్రేక్ పాయింట్‌ను కాపాడుకుని సర్వీస్‌ను నిలబెట్టుకున్నాడు. అయితే ఆ తర్వాత మాత్రం సోమ్‌దేవ్ కసి కొద్దీ ఆడాడు. సర్వీస్‌తో పాటు రిటర్న్ షాట్లతో అలరించాడు. సోమ్‌దేవ్ బ్యాక్‌హ్యాండ్ షాట్లకు లజోవిక్ నుంచి సమాధానం కరువైంది. ఫలితంగా 3-1 ఆధిక్యంలోకి వెళ్లి సెట్‌ను దక్కించుకున్నాడు. ఇక చివరి సెట్‌లోనూ మూడు, ఏడో గేమ్‌లో సర్వీస్‌ను బ్రేక్ చేసి తనదైన శైలిలో మ్యాచ్‌ను ముగించాడు.