ముంబై: బీసీసీఐలో తరచూ వార్తల్లోకి ఎక్కుతున్న ‘పరస్పర విరుద్ధ ప్రయోజనాలు’ అంశంపై మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ఘాటుగా వ్యాఖ్యానించాడు. బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడైన గంగూలీ మాట్లాడుతూ ఆ వివాదాస్పద నిబంధనపై ముందుగా శాస్త్రీయ కసరత్తు జరగాలని సూచించాడు. ‘తాజాగా ద్రవిడ్‌ను ఈ నిబంధనలోకి లాగారు.. ఇండియా సిమెంట్స్ ఉపాధ్యక్షుడైన అతన్ని జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్‌గా నియమించడంపై వివాదాన్ని రేపుతున్నారు. నిజానికి ఏది విరుద్ధ ప్రయోజనమో ప్రాక్టికల్‌గా ఆలోచించాలి.
ఎన్‌సీఏ డైరెక్టర్ పదవో, మరేదైన క్రికెట్ జాబ్‌లేవీ శాశ్వతమైన ఉద్యోగాలు కావు. దీనికి ఓ శాస్త్రీయ పరిష్కారాన్ని కనుగొనాలి. టీవీ వ్యాఖ్యానం, కోచింగ్ ఎలా పరస్పర విరుద్ధ ప్రయోజనాలవుతాయో నాకైతే అర్థం కావట్లేదు. మీరు మిగతా క్రికెట్ ప్రపంచాన్ని చూస్తే... ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ ఆ దేశ జట్టుకు కోచింగ్ ఇస్తున్నాడు. టీవీ వ్యాఖ్యానం కూడా చేస్తాడు. దీంతో పాటు వచ్చే ఏప్రిల్‌లో ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు మెంటా ర్‌గా వ్యవహరిస్తాడు. ఇవి ఏవైనా నైపుణ్యానికి సంబంధించినవే తప్ప... విరుద్ధ ప్రయోజనాలకు సంబంధించినవి కావు. ఎవరికైతే నైపుణ్యముంటే వారినే ఎంచుకుంటారు. ఇందులో తప్పేంటి’ అని మాజీ కెప్టెన్ గంగూలీ విశ్లేషించాడు. అయితే దిగ్గజాలకు విరుద్ధ ప్రయోజనాల అంశం నుంచి మినహాయింపు ఇవ్వాల ని కోరుతున్నారా అన్న ప్రశ్నకు సమాధానమి స్తూ అలాంటిది ఆశించడం లేదని చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment