టీమిండియాకు షాక్
ధర్మశాల: మూడు ట్వంటీ 20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో ఇక్కడ శుక్రవారం జరిగిన తొలి ట్వంటీ 20 మ్యాచ్ లో టీమిండియాకు షాక్ తగిలింది. టీమిండియా విసిరిన 200 పరుగుల భారీ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు హషీమ్ ఆమ్లా( 36), ఏబీ డివిలియర్స్ (51)లు శుభారంభాన్ని అందించారు. ఆమ్లా తనదైన శైలిలో ఆడితే డివిలియర్స్ వచ్చీ రావడంతోనే రెచ్చిపోయాడు. కాగా, వీరు స్వల్ప పరుగుల వ్యవధిలో అవుటైన వెంటనే డు ప్లెసిస్ (4) కూడా పెవిలియన్ కు చేరడంతో దక్షిణాఫ్రికా కాస్త ఆందోళనలో పడింది.
అనంతరం జేపీ డుమినీ, బెహర్దియన్ లు దూకుడుగా ఆడారు. డుమినీ(68), బెహర్దియన్(32) పరుగులతో క్రీజ్ లో నాటౌట్ గా ఉండి దక్షిణాఫ్రికాకు విజయాన్ని అందించారు. వీరిద్దరూ నాల్గో వికెట్ కు 105 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో దక్షిణాఫ్రికా ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సాధించింది. ఈ తాజా విజయంతో దక్షిణాఫ్రికా 1-0 ఆధిక్యాన్ని సంపాందించింది. 15 ఓవర్ వరకూ విజయం టీమిండియా చేతుల్లో ఉన్నట్లు కనిపించినా.. ఆ తదుపరి ఓవర్ టీమిండియా విజయాన్ని పూర్తిగా దూరం చేసింది. 16 ఓవర్ వేసిన అక్షర్ పటేల్ 22 పరుగులను దక్షిణాఫ్రికాకు సమర్పించుకున్నాడు. ఆ ఓవర్ లో డుమినీ వరుసగా మూడు సిక్సర్లు వేసి దక్షిణాఫ్రికా విజయం సాధించడానికి మార్గం సుగుమం చేశాడు. వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన డుమినికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. టీమిండియా బౌలర్లలో ఎవరూ ఆకట్టుకోలేదు. అశ్విన్, ఎస్ అరవింద్ లకు తలో వికెట్ దక్కింది.
అంతకుముందు టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో టీమిండియా బ్యాటింగ్ చేపట్టింది. భారత్ స్కోరు 22 పరుగుల వద్ద ఉండగా ఓపెనర్ శిఖర్ ధవన్(3) అనవసర పరుగుకోసం యత్నించి రనౌట్ గా పెవిలియన్ చేరాడు. అనంతరం రోహిత్ శర్మ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. దక్షిణాఫ్రికా బౌలర్లకు పరీక్షగా నిలుస్తూ(106; 66బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీని పూర్తి చేశాడు. దీంతో అంతర్జాతీయ ట్వంటీ20 ల్లో తొలి సెంచరీని రోహిత్ నమోదు చేశాడు. రోహిత్ కు జతగా విరాట్ కోహ్లి (43) రాణించడంతో రెండో వికెట్ కు 138 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. కాగా, విరాట్, రోహిత్ వికెట్లను వరుసగా కోల్పోవడంతో టీమిండియా వేగం తగ్గింది. విరాట్ రెండో వికెట్ రూపంలో వెనుదిరిగగా, రోహిత్ మూడు వికెట్ గా పెవిలియన్ కు చేరాడు.అటు తరువాత స్కోరును పెంచే యత్నంలో సురేష్ రైనా(14) అవుటయ్యాడు. కాగా, అజింక్యా రహానే స్థానంలో తుది జట్టులో కలిసిన అంబటి రాయుడు డకౌట్ గా వెనుదిరగగా, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(20) నాటౌట్ మిగలడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది.