జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా క్రికెట్ స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ మరోసారి జట్టుకు దూరమయ్యాడు. భారత్‌తో జరిగే ట్వంటీ 20 సిరీస్ నుంచి పూర్తిగా వైదొలిగాడు. మోకాలి గాయం కారణంగా అతను టీ 20 సిరీస్ నుంచి తప్పుకున్నట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించింది. తొలుత భారత్‌తో తొలి మూడు వన్డేలకు చేతి వేలి గాయం కారణంగా దూరమైన డివిలియర్స్.. తదుపరి మూడో వన్డేలకు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ మూడు వన్డేల్లో డివిలియర్స్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. కాగా, మూడు టీ 20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్ నుంచి డివిలియర్స్ చివరినిమిషంలో తప్పుకున్నాడు. మ్యాచ్ ఆరంభానికి కొద్ది నిమిషాల ముందు ఏబీ గాయం కారణంగా అర్థాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది.
' ఐదో వన్డే తర్వాత ఏబీ మోకాలికి గాయమైంది. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతను గాయపడ్డాడు. అయినప్పటికీ శుక్రవారం ఫిట్‌నెస్ పాసై ఆరో వన్డేకు అందుబాటులోకి వచ్చాడు. గాయం కొద్దిగా బాధిస్తున్నా మ్యాచ్ ఆడాడు. దాంతో టీ 20 సిరీస్‌కు ముందు ఫిట్‌నెస్ టెస్టులో ఏబీ విఫలమయ్యాడు.' అని దక్షిణాఫ్రికా టీమ్ మేనేజర్ మొహ్మద్ మూసాజీ తెలిపారు. వచ్చే నెల 1వ తేదీన ఆసీస్‌తో జరిగే తొలి టెస్టు నాటికి డివిలియర్స్ అందుబాటులోకి వస్తాడని దక్షిణాఫ్రికా క్రికెట్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment