
దక్షిణాఫ్రికా తడబాటు
అడిలైడ్: చివరి టెస్టులో పరువు కోసం పోరాడుతున్న ఆస్ట్రేలియా జట్టు దక్షిణాఫ్రికాను కట్టడి చేస్తోంది. మూడో రోజు శనివారం తమ రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన ప్రొటీస్ ఆట ముగిసే సమయానికి 69 ఓవర్లలో ఆరు వికెట్లకు 194 పరుగులు చేసింది. ఓపెనర్ స్టీఫెన్ కుక్ (199 బంతుల్లో 81 బ్యాటింగ్; 7 ఫోర్లు) జట్టుకు అండగా నిలవగా... హషీమ్ ఆమ్లా (80 బంతుల్లో 45; 6 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో డు ప్లెసిస్ (12) నిరాశపరిచాడు. కుక్‌తో పాటు క్రీజులో డి కాక్ పరుగులేమీ చేయకుండా ఉన్నాడు.
స్పిన్నర్ నాథన్ లియోన్ మూడు, మిషెల్ స్టార్క్ రెండు వికెట్లు తీశారు. ప్రస్తుతం జట్టు 70 పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఉంది. అంతకుముందు ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్ ను 121.1 ఓవర్లలో 383 పరుగుల వద్ద ముగించింది. 307/6 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించగా... ఖాజా (308 బంతుల్లో 145; 12 ఫోర్లు) మొదట్లోనే అవుటయ్యాడు. స్టార్క్ (91 బంతుల్లో 53; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేశాడు. అబాట్, రబడాలకు మూడేసి వికెట్లు దక్కారుు.