
ఉత్కంఠ పోరులో దక్షిణాఫ్రికా విజయం
చిట్టగాంగ్: పొట్టి ఫార్మెట్ లో మరో ఉత్కంఠ పోరుకు తెరలేచింది. ఆద్యంతం రక్తికట్టించిన దక్షిణాఫ్రికా-న్యూజిలాండ్ ల మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు అసలు సిసలైన మజాను అందించింది. ట్వంటీ 20 వరల్డ్ కప్ లో భాగంగా సోమవారం న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా రెండు పరుగుల తేడాతో విజయం సాధించి టోర్నీలో శుభారంభ చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ లక్ష్య ఛేదనతో బ్యాటింగ్ ఆరంభించిన కివీస్ కు ఓపెనర్లు మంచి ఇన్నింగ్స్ తో పునాది వేశారు. గుప్తిల్(22), విలియమ్ సన్ (51) పరుగులు చేసి జట్టును విజయం దిశగా నడిపించారు.అనంతరం రాస్ టేలర్(62) పరుగుల మినహా ఎవరూ పెద్దగా ఆకట్టుకోకపోవడంతో కివీస్ కు ఓటమి తప్పలేదు.
చివరి బంతికి వరకూ దోబూచులాడిన ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాదే పైచేయి అయ్యింది. స్టెయిన్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరు బంతికి మూడు పరుగులు చేయాల్సి తరుణంలో రాస్ టేలర్ క్రీజ్ లో ఉన్నాడు. ఆ సమయంలో కివీస్ అవలీలగా గెలుస్తుందని అంతా భావించారు. కాగా, స్టెయిన్ మాత్రం ఆ అవకాశం ఇవ్వలేదు. చక్కటి బంతి సంధించి కివీస్ ను బోల్తా కొట్టించాడు. రెండు పరుగుల చిరస్మరణీయ విజయాన్ని జట్టుకు అందించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో స్టెయిన్ కు నాలుగు వికెట్లు లభించగా, ఇమ్రాన్ లో రెండు వికెట్లు దక్కాయి.
టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత దక్షిణాఫ్రికాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఆదిలోనే ఓపెనర్ డీ కాక్ (4)పరుగులకే పెవిలియన్ చేరి సఫారీలు షాకిచ్చాడు. తర్వాత డుప్లిసెస్ కూడా (13) పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టడంతో స్కోరును చక్కదిద్దే బాధ్యతను ఆమ్లా తన భుజాలపై వేసుకున్నాడు. ఓ ప్రక్క ఆమ్లా క్రీజ్ లో నిలకడగా ఆడుతుండగా సఫారీలు డివిలియర్స్(5) రూపంలో మరో వికెట్టును చేజార్చుకుంది. ఆమ్లా (41) పరుగులు చేసి పెవిలియన్ చేరాకే దక్షిణాఫ్రికా స్కోరు బోర్డు నత్తనడకన సాగింది. అప్పటికే క్రీజ్ లో ఉన్న డుమినీ (86) పరుగులు చేయడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది.