
తొలి టెస్టు కోసం భారత జట్టు 12 మందితో జాబితా ప్రకటించడం అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రానికి సిద్ధమైన ఒక 18 ఏళ్ల కుర్రాడిలో ఉద్వేగానుభూతిని నింపి ఉండవచ్చు. భారత జట్టులోకి ఎంపికయ్యేందుకు ఏమేం చేయాలో గత రెండేళ్లలో పృథ్వీ షా అన్నీ చేశాడు. జూనియర్ స్థాయిలో గానీ ఇండియా ‘ఎ’ తరఫున గానీ ఆడిన అన్ని మ్యాచ్‌లలో అతను చాలా బాగా ఆడాడు. ఇది అతడికి అంతులేని ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుందనడంలో సందేహం లేదు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో కలిసి షా గుర్తుంచుకోదగిన ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పగలడు. ఓవల్‌లో జరిగిన తప్పును పునరావృతం చేయరాదని సెలక్టర్లు భావించడంతో ఈసారి మయాంక్ అగర్వాల్‌ను పక్కన పెట్టక తప్పలేదు.
ఇంగ్లండ్‌లో అప్పటి వరకు జట్టుతో ఉన్న కరుణ్ నాయర్‌ను కాదని చివరి టెస్టుకు హనుమ విహారిని ఎంపిక చేయడం విమర్శలకు తావిచ్చింది. టీమ్ మేనేజ్‌మెంట్ నమ్మకాన్ని గెలవలేకపోయిన కరుణ్ నాయర్‌లాంటి పరిస్థితి మయాంక్ అగర్వాల్‌ది కాదు కాబట్టి ఇవాళ కాకపోయినా రేపైనా అతనికి అవకాశం దక్కడం ఖాయం. భారత జట్టు ముగ్గురు సీమర్లతో ఆడుతుందా లేక ఇద్దరితోనా అనేది చూడాలి. బ్యాటింగ్‌లో కూడా చక్కగా రాణిస్తున్న జడేజాకు పిచ్‌పై టర్న్ లభిస్తే పెద్ద సంఖ్యలో వికెట్లు తన ఖాతాలో వేసుకోగలడు. కుల్దీప్ యాదవ్‌ను ఆడటం కూడా అంత సులువు కాదు. ఇక అశ్విన్‌ను అయితే ఉపఖండంలో మెరుగ్గా ఎదుర్కోగలగడం దాదాపు అసాధ్యం. 2013లో ఇక్కడకు వచ్చిన జట్టుతో పోలిస్తే ప్రస్తుత వెస్టిండీస్ మెరుగ్గా ఉంది. ముఖ్యంగా వారి బ్యాటింగ్‌లో నాటి కరీబియన్ మెరుపులు కనిపిస్తున్నాయి. నిలకడగా 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తున్న గాబ్రియెల్‌తో జట్టు బలం పెరిగింది. భారత్ సిరీస్ ఎలాగూ గెలుస్తుంది. అయితే 2013 సిరీస్ అంత సులభం మాత్రం కాదు.
Comments
Please login to add a commentAdd a comment