
ఒకటి దిగ్గజం... రెండు ప్రమాదకరం... మరోటి అరంగేట్రం... ప్రపంచకప్ గ్రూప్ ‘డి’ జట్ల ముఖచిత్రమిది. పోయినసారి త్రుటిలో చేజారిన కప్‌ను ఈసారైనా ఒడిసిపట్టాలనేది మాజీ చాంపియన్ అర్జెంటీనా ప్రయత్నం కాగా... అంచనాలను తలకిందులు చేసే నైజీరియా, కొన్నాళ్లుగా ఎదుగుతున్న క్రొయేషియాలు సామర్థ్యం చాటేందుకు సిద్ధమవుతున్నాయి. తమ దేశం స్థాయికి ఊహకైనా చిక్కని ఘనతను అందుకున్న ఐస్‌లాండ్... ఒక్క విజయం సాధించినా విశ్వ సమరంలో పాల్గొన్నామన్న తృప్తి పొందుతుంది.
అర్జెంటీనా... మెస్సీ మయం
అది క్లబ్ జట్టయినా సరే, లియోనల్ మెస్సీ ఉంటే ఆ ఆకర్షణే వేరు. ఇక అతడు కెప్టెన్‌గా ఉన్న జాతీయ జట్టు ప్రపంచకప్‌లో ఆడుతోందంటే చూపు తిప్పుకోలేం. క్వాలిఫయింగ్ పోటీల్లో ఓ దశలో వెనుకబడినా, మెస్సీ మాయతోనే గట్టెక్కింది అర్జెంటీనా. దీన్నిబట్టి జట్టుపై అతని ప్రభావం అంచనా వేయొచ్చు. కెరీర్ చరమాంకానికి చేరుకున్నందున ఆటగాడిగానూ 31 ఏళ్ల మెస్సీకిది కీలక టోర్నీ. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న అతడు... దేశానికి కప్ అందిస్తే మరో మారడోనాగా చరిత్రలో నిలిచిపోతాడు. తద్వారా 2014లో తన నాయకత్వంలో కప్ చేజారిం దన్న వేదన కూడా తీరుతుంది. సెర్గియో అగ్యురో, గొంజాలో హిగుయెన్, డారియా బెన్‌డెట్టో సైతం రాణిస్తే కప్పు కోసం అర్జెంటీనా 32 ఏళ్ల నిరీక్షణకు తెరపడుతుంది. బలాబలాల రీత్యా చూస్తే గ్రూప్‌లో అగ్రస్థానంతో నాకౌట్ చేరే అవకాశాలే ఎక్కువ.
కీలకం: మెస్సీ, అగ్యురో, హిగుయెన్. గత కప్‌లో మెస్సీ రాణించినా హిగుయెన్ ఫామ్‌లో లేకపోవడం దెబ్బతీసింది. బెన్‌డెట్టోపైనా అంచనాలున్నాయి.
కోచ్: జార్జ్ సంపోలి. ఏడాదిలో జట్టుకితడు మూడో కోచ్. సంపోలి బాధ్యతలు స్వీకరించాక కూడా ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. నాలుగు అధికారిక మ్యాచ్‌ల్లో ఒక్కటే గెలిచింది.
ప్రపంచ ర్యాంక్ : 5
చరిత్ర : రెండుసార్లు (1978, 1986) విజేత. రెండుసార్లు (1990, 2014) రన్నరప్.
క్రొయేషియా... కొరుకుడు పడేనా!
క్లబ్ జట్ల తరఫున అద్భుతంగా ఆడిన ఆటగాళ్ల కారణంగా... కాగితంపై క్రొయేషియా బలమైనదిగానే కనిపిస్తుంది. వేగంగా కదిలే కెప్టెన్ లూకా మోడ్రిక్‌తో పాటు, మారియో మండ్జుక్, ఇవాన్ రాక్టిక్, ఇవాన్ పెర్సిక్ వంటి వారున్న ఈ జట్టును తక్కువ అంచనా వేయలేం. ‘క్రొయేషియా’ దేశం హోదాతో అడుగిడిన తొలి ప్రపంచకప్ (1998)లోనే సెమీస్‌కు చేరింది.
కీలకం: లూకా మోడ్రిక్. కెప్టెన్‌గా జట్టును ముందుకు తీసుకెళ్తాడని భావిస్తున్నారు.
కోచ్: జ్లాట్కో డాలిక్. క్వాలిఫయింగ్ పోటీల్లో జట్టు క్లిష్ట పరిస్థితుల్లో బాధ్యతలు తీసుకున్నాడు. ఉక్రెయిన్, గ్రీస్‌లపై విజయాలకు వ్యూహాలు పన్ని ప్రపంచకప్ అర్హత సాధించి పెట్టాడు.
ప్రపంచ ర్యాంక్ : 20
చరిత్ర: నాలుగుసార్లు అర్హత సాధించింది. 1998లో సెమీస్ చేరడం అత్యుత్తమం. 2014లో గ్రూప్ దశలోనే నిష్క్రమించింది.
నైజీరియా... గద్దలా తన్నుకుపోగలదు
ఆఫ్రికా చాంపియన్స్ కామెరూన్, జాంబియాలు ఉన్న గ్రూప్‌లో తొలి స్థానంలో నిలిచి ఆ ఖండం నుంచి ప్రపంచకప్‌నకు అర్హత సాధించిన తొలి దేశం నైజీరియా. వరుస దాడులతో బెంబేలెత్తించి తనదైన రోజు ఏ జట్టునైనా ఓడించగల సత్తా ఈ సూపర్ ఈగల్స్ సొంతం. క్వాలిఫయింగ్ సమీకరణాల్లో ఓ దశలో అర్జెంటీనా అవకాశాలనే ప్రభావితం చేసింది. గత ఆరు కప్‌లలో అయిదింటిలో ఆడింది. గ్రూప్‌లో రెండో స్థానంతో నాకౌట్‌కు వెళ్లగలదు.
కీలకం: కెప్టెన్ జాన్ ఒబి మికెల్. మిడ్ ఫీల్డ్‌లో మెరిక. అలెక్స్ ఇవోబి, విక్టర్ మోసెస్, కెలెచి ఇహెనాకో కూడా ప్రమాదకారులే.
కోచ్: గెర్నాట్ రోర్. 2014 నుంచి జట్టుకు ఎనిమిదో కోచ్. మౌనంగానే పనిచేసుకుపోయే వ్యక్తి.
ప్రపంచ ర్యాంక్ : 48
చరిత్ర: 1994లో అరంగేట్రం చేసింది. ఇప్పటికి ఐదుసార్లు క్వాలిఫై అయింది. మూడుసార్లు నాకౌట్‌కు చేరింది.
ప్రతిభ, అంకితభావం... ఐస్‌లాండ్
ప్రస్తుతం కప్ బరిలో ఉన్న దేశాలన్నింటిలో అతి తక్కువ జనాభా ఉన్న దేశం. దీని జనాభా 3 లక్షల 30 వేలు. ఆతిథ్య రష్యా రాజధాని మాస్కోలోనే ఇంతకంటే 40 రెట్లు జనం ఉండటం విశేషం. అయినా ఆటలో ప్రతిభకు హద్దేముంది అన్నట్లు... జెయింట్ కిల్లర్‌లా అరంగేట్రం చేస్తోంది. ఇంగ్లండ్‌ను ఓడించి 2016 యూరో కప్‌లో క్వార్టర్స్‌కు చేరింది ఐస్‌లాండ్. కాబట్టి అదృష్టవశాత్తు తొలిసారి ప్రపంచకప్ బెర్త్ దక్కిందనుకుంటే పొరపాటే. క్రొయేషియా కంటే ముందే రష్యా టికెట్ సంపాదించింది. ఆశావహ దృక్పథమే జట్టును నడిపిస్తోంది.
కీలకం: అరాన్ గునర్సన్. పదే పదే దాడులకు దిగే జిల్ఫీ సిగుర్డ్సన్ కూడా ప్రమాదకారే.
కోచ్: హీమర్ హల్‌గ్రిమ్సన్. మాజీ ఆటగాడు. వృత్తి రీత్యా దంత వైద్యుడు. గతేడాది సహాయ కోచ్ లార్స్ లాగర్‌బ్యాక్ వైదొలగాక పూర్తి బాధ్యతలు తీసుకున్నాడు. ప్రపంచకప్ వరకు తీసుకొచ్చాడు.
ప్రపంచ ర్యాంక్ : 22
Comments
Please login to add a commentAdd a comment