పిచ్ పాపమెంత..! | Spin pitches in India | Sakshi
Sakshi News home page

పిచ్ పాపమెంత..!

Published Sun, Nov 29 2015 12:04 AM | Last Updated on Sun, Sep 3 2017 1:10 PM

పిచ్ పాపమెంత..!

పిచ్ పాపమెంత..!

 ప్రపంచ నంబర్‌వన్ జట్టు దక్షిణాఫ్రికా నాలుగు టెస్టుల సిరీస్‌ను కేవలం ఏడు రోజుల ఆటలోనే భారత్‌కు సమర్పించుకుంది. భారత్‌లో పిచ్‌లు స్పిన్‌కు అనుకూలిస్తాయని ముందే తెలిసినా... సరిగా సన్నద్ధం కాకపోవడం దీనికి ఓ కారణం. అయితే మరీ ఈ స్థాయిలో మూడు రోజుల్లో మ్యాచ్‌లు ముగిసేలా పిచ్‌లు తయారు చేస్తారనేది అసలు ఏమాత్రం ఊహించని అంశం. ఇలాంటి పిచ్‌లు తయారు చేయడం న్యాయమేనా? దీనివల్ల టెస్టు క్రికెట్‌కు ఆదరణ తగ్గుతుందా? పెరుగుతుందా?
 
 సాక్షి క్రీడావిభాగం
 యాషెస్ సిరీస్‌లో రెండు రోజుల్లో టెస్టు ముగిస్తే ఎవరూ ఎందుకని ప్రశ్నించలేదు? మేం డర్బన్ వెళ్లినప్పుడు పచ్చికతో కళకళలాడే పిచ్‌లు ఎదురైతే ఇదేంటని ఎవరూ ఆశ్చర్యపోలేదు? మన దగ్గర స్పిన్ పిచ్‌లు ఎదురైతే మాత్రం మన మీడియానే విమర్శిస్తోంది. ఇది కరెక్టేనా..? భారత విజయంలో కీలక పాత్ర పోషించిన రవిచంద్రన్ అశ్విన్ ప్రశ్న ఇది. నిజమే... స్వదేశంలో పరిస్థితులు తమ ఆటశైలికి సరిపోయేలా ఉండాలని ప్రతి జట్టూ కోరుకుంటుంది. ఇందులో తప్పేం లేదు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా... ఇలా ఏ దేశం వెళ్లినా అక్కడి పేస్, స్వింగ్, బౌన్స్‌ను ఆ దేశాల బౌలర్లలా మనం ఉపయోగించుకోలేం. భారత జట్టు 200 పరుగులకు చాప చుట్టేసిన పిచ్‌పై ప్రత్యర్థులు 400 పరుగులు అలవోకగా చేస్తారు. ఎందుకంటే ఆ పరిస్థితులు వాళ్లకు అలవాటు కాబట్టి. అయితే మనం ఏ దేశంలో ఆడటానికి వెళ్లినా మరీ మూడు టెస్టుల్లో రెండు మ్యాచ్‌లు మూడు రోజుల్లో ముగిసిపోలేదు.
 
 కావాలని చేసినవే
 టి20, వన్డే సిరీస్‌లలో ఓటమి తర్వాత పిచ్‌లపై చర్చ బాగా జరిగింది. ముఖ్యంగా ముంబైలో చివరి వన్డేలో భారత్ స్పిన్నర్లకు అనుకూలించే వికెట్ తయారు చేయమని కోరినా... క్యురేటర్ స్పందించలేదు. దీంతో రవిశాస్త్రి ఆ క్యురేటర్‌ను తిట్టారనే వార్తతో వివాదం ముదిరింది. అయితే ప్రతిసారీ ఏ జట్టుతో ఆడినా స్పిన్‌కు సహకరించే వికెట్లు తయారు చేయడం మన దగ్గర ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ. ఇది ఇప్పుడు దక్షిణాఫ్రికా కోసమే చేసిందేం కాదు. అయితే ఎప్పటికంటే ఈసారి కాస్త ఎక్కువగా క్యురేటర్లు స్పందించారు. మొహాలీ పేస్ బౌలింగ్‌కు ప్రసిద్ధి. బెంగళూరు, నాగ్‌పూర్ బ్యాట్స్‌మెన్‌కు స్వర్గధామం. కానీ సహజసిద్ధంగా అక్కడ ఉండే పరిస్థితులకు భిన్నంగా ఈసారి వికెట్లు తయారయ్యాయి. నిజానికి టెస్టు సిరీస్ షెడ్యూల్ ప్రకటించినప్పుడు... ఒక్క ఢిల్లీ మినహా మిగిలిన అన్ని పిచ్‌లూ దక్షిణాఫ్రికా శైలికి సరిపోయేలా ఉన్నాయి. అప్పట్లో కాస్త ఆశ్చర్యమనిపించినా.... వికెట్లను పూర్తిగా స్పిన్నర్లకు సరిపోయేలా మార్చేశారు. దక్షిణాఫ్రికాలాంటి బలమైన జట్టును ఓడించాలంటే ఇంతకంటే మార్గం లేదు.
 
 వాళ్ల వైఫల్యమూ ఉంది
 నిజానికి పిచ్ గురించిన చర్చలో దక్షిణాఫ్రికా క్రికెటర్లు సంయమనంతో మాట్లాడారు. ఎక్కడా పిచ్‌ల మీద విమర్శలు చేయలేదు. ‘టెస్టు క్రికెట్ అంటేనే సవాల్. విభిన్న పరిస్థితుల్లో రాణిస్తేనే మన సత్తా బయటకు వస్తుంది’ అంటూ అసహనాన్ని దాచేసుకుని ఇలాంటి రెగ్యులర్ డైలాగ్‌లు చెప్పారు. కానీ ఈ పిచ్‌లపై ఆడటం వాళ్లకు బాగా అసహనాన్ని కలిగించే ఉంటుంది. అయితే ఇలాంటి పిచ్‌లు ఎదురవుతాయని మొహాలీ మ్యాచ్ ఆరంభానికి ముందే సఫారీలకు తెలుసు. దీనికి తగ్గట్టుగా సన్నద్ధం కావడంలో విఫలమయ్యారు. ప్రస్తుత లైనప్‌లో ఆమ్లా, డు ప్లెసిస్, డివిలియర్స్, డుమిని నలుగురికీ స్పిన్ ఆడటంలో కావలసినంత నైపుణ్యం, అనుభవం ఉన్నాయి. అయినా సన్నాహక లోపమే వారిని ముంచింది. మరోవైపు దక్షిణాఫ్రికా ప్రధాన స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ ఒక్క మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో మినహాయిస్తే ఆకట్టుకోలేకపోయాడు. పార్ట్‌టైమ్ స్పిన్నర్లు వికెట్లు తీసిన చోట కూడా విఫలమయ్యాడు. ఇది కూడా ప్రపంచ నంబర్‌వన్ జట్టుపై ప్రభావం చూపింది.
 
 పిచ్‌లో దెయ్యం లేదు
 మొహాలీ, నాగ్‌పూర్ రెండు టెస్టుల్లోనూ మూడు రోజుల్లో ఫలితం రావడం కాస్త ఆశ్చర్యకరమే అయినా... మాజీ క్రికెటర్లు పలువురు దీనిని సమర్ధించారు. ‘నిజానికి పిచ్‌లో దెయ్యమేమీ లేదు. బ్యాట్స్‌మెన్ ఎవరూ ఓపికగా ఆడలేకపోయారు. దక్షిణాఫ్రికానే కాదు భారత బ్యాట్స్‌మెన్ కూడా సంయమనంతో ఆడలేదు’ అని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. నాగ్‌పూర్‌లో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో ఆమ్లా, డు ప్లెసిస్ ఆడిన విధానం చూస్తే ఈ పిచ్‌లపై మరీ భయపడాల్సిన స్థాయిలో ప్రమాదం లేదు. టర్న్ కాస్త ఎక్కువగానే ఉన్నా టెక్నిక్‌ను ఉపయోగించి ఆడితే పరుగులు వస్తాయి. గతంలో ఇలాంటి అనేక పిచ్‌లపై ద్రవిడ్, సచిన్, లక్ష్మణ్‌లాంటి దిగ్గజాలు ఆడి సెంచరీలు చేసి చూపించారు. కాబట్టి ప్రస్తుత యువ క్రికెటర్లు దీనిని కూడా అలవాటు చేసుకోవాలి.
 
 చిరాకు కలిగించిందా..!
 టెస్టు క్రికెట్ మీద ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అభిప్రాయం ఉంటుంది. నిజానికి అటు బ్యాట్స్‌మెన్, ఇటు బౌలర్లు ఇద్దరూ తమ అసలు సిసలు సత్తాను బయటపెట్టేది ఈ ఫార్మాట్‌లోనే. ఏ మ్యాచ్ అయినా ఐదో రోజు వరకూ జరిగి ఉత్కంఠగా ముగిస్తేనే ఈ ఫార్మాట్‌కు ఆదరణ. మొహాలీలో తొలి టెస్టులో మూడు రోజుల్లో ఆట ముగిసినప్పుడు... భారత అభిమానులు చాలామంది సంతోషించారు. అప్పటికే టి20, వన్డే సిరీస్‌లు కోల్పోయినందున ఈ విజయం సంతోషాన్నిచ్చింది. అయితే నాగ్‌పూర్‌లో మాత్రం అదే సీన్ ఏమాత్రం ఆనందాన్నివ్వలేదు. రెండో రోజు సాయంత్రానికే 32 వికెట్లు పడిపోతే పెద్దగా మజా రాలేదు. ‘అసలు ఇది క్రికెట్ కాదు’ అనే అభిప్రాయం కూడా కొంతమందిలో వచ్చింది.
 
 టాస్ కీలకం కాకూడదు
 నాగ్‌పూర్‌లో టాస్ గెలిచిన జట్టు కచ్చితంగా బ్యాటింగ్ ఎంచుకుంటుంది. తొలి రోజు తప్ప ఆ వికెట్‌పై బ్యాటింగ్ చేయడం సాధ్యం కాదని కోహ్లి కుండబద్దలు కొట్టేశాడు. టాస్ గెలవగానే భారత్ సగం మ్యాచ్ గెలిచేసింది. పిచ్ మన ఆటతీరుకు సరిపోయేలా ఉంది... టాస్ కూడా గెలిస్తే ఇక ప్రత్యర్థి కోలుకోవడం కష్టం. అందుకే ఇటీవల టాస్ గురించి కూడా చర్చ పెరిగింది. తొలుత బ్యాటింగ్ చేయాలో లేక బౌలింగ్ చేయాలో పర్యాటక జట్టు నిర్ణయించుకోవాలనే వాదన మొదలైంది. వచ్చే సీజన్‌లో ఇంగ్లండ్ కౌంటీలలో దీనిని అమల్లోకి తెస్తున్నారు. ఇలాంటి మ్యాచ్ జరుగుతూ ఉంటే అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా దీనిని తొందర్లోనే చూస్తామేమో..!
 
 దక్షిణాఫ్రికా బలహీనత స్పిన్ కాబట్టి... అలాంటి పిచ్ తయారు చేసుకోవడం తప్పు కాకపోవచ్చు. ఈ టెస్టు సిరీస్‌లో తయారు చేసిన వేదికలపై ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు కూడా లేవు. కానీ హేమాహేమీలున్న దక్షిణాఫ్రికా జట్టు కూడా ఇలాంటి పిచ్‌లపై ఆడలేకపోతే.... మిగిలిన జట్ల పరిస్థితి ఏమిటి? ఓ వైపు టెస్టులకు ఆదరణ పెంచాలంటూ డేనైట్ మ్యాచ్, పింక్ బంతి అంటూ ప్రయోగాలు చేస్తుంటే... మరోవైపు ఇలాంటి పిచ్‌లతో మూడు రోజుల్లో మ్యాచ్ ముగిస్తే అభిమానుల్లో ఆసక్తి ఉంటుందా..? దీనిపై అన్ని దేశాల బోర్డులతో పాటు ఐసీసీ కూడా పునరాలోచన చేయాలి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement