ఆలిండియా జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో టాప్ సీడ్ శ్రీకృష్ణ (తెలంగాణ)-సాయి పవన్ (ఏపీ) జోడి అండర్-17 టైటిల్‌ను సాధించింది. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన అండర్-17 బాలుర డబుల్స్ ఫైనల్లో ఈ జోడి 21-10, 21-13తో సిద్ధార్థ మిశ్రా-సిద్ధాంత్ సలార్ (ఉత్తరప్రదేశ్) జంటపై గెలుపొందింది. ఇదే విభాగం సింగిల్స్ ఫైనల్లో రాహుల్ భరద్వాజ్ (కర్ణాటక) 21-18, 21-8తో మైస్నం మెరాబా (మణిపూర్)పై నెగ్గాడు. బాలికల తుదిపోరులో ఆకర్షి కశ్యప్ (చత్తీస్‌గఢ్) 21-8, 21-8తో రాషి లంబే (మహారాష్ట్ర)పై గెలిచింది. డబుల్స్‌లో అశ్విని భట్-మిథుల (కర్ణాటక) 21-15, 18-21, 21-13తో సిమ్రాన్ సింగ్-రితిక ఠక్కర్ (మహారాష్ట్ర)పై విజయం సాధించారు.
అండర్-19 బాలుర సింగిల్స్‌లో తుదిపోరులో మిథున్ (ఎయిరిండియా) 21-4, 4-0తో బెంగాల్‌కు చెందిన అరింతప్ దాస్‌గుప్తా (రిటైర్డ్‌హర్ట్)పై నెగ్గాడు. బాలికల టైటిల్‌ను శిఖ గౌతమ్ (కర్ణాటక) 21-17, 21-14తో ఐరా శర్మ (హరియాణా)పై గెలిచి చేజిక్కించుకుంది. బాలుర డబుల్స్ ఫైనల్లో బోధిత్ జోషి (ఉత్తరాఖండ్)-మిథున్ (ఎయిరిండియా) 21-19, 21-9తో గౌస్ షేక్-బషీర్ సయ్యద్ (ఏపీ)పై గెలుపొందాడు. బాలికల డబుల్స్ తుదిపోరులో మహిమ అగర్వాల్-శిఖ గౌతమ్ (కర్ణాటక) 17-21, 21-17, 22-20తో అశ్విని భట్-మిథుల (కర్ణాటక)లపై విజయం సాధించారు. మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో కృష్ణ ప్రసాద్ (ఏపీ)-మహిమ అగర్వాల్ (కర్ణాటక) 21-15, 22-20తో బాలరాజ్-మిథుల (కర్ణాటక)పై గెలుపొందారు.
అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి ట్రోఫీలు అందజేశారు. ఇందులో ‘శాట్స్’ ఎండీ దినకర్ బాబు, భారత చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు మల్‌రెడ్డి రంగారెడ్డి, కార్యదర్శి అమర్‌నాథ్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు చాముండేశ్వరినాథ్, స్థానిక కార్పొరేటర్ పారుపల్లి అనిత దయాకర్ రెడ్డి, డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
శ్రీకృష్ణ-సాయి పవన్ జంటకు టైటిల్
Published Mon, Jul 25 2016 3:22 PM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM
Advertisement