
న్యూఢిల్లీ: వాయు కాలుష్యంలో టెస్టు నిర్వహణ పట్ల శ్రీలంక జట్టు కోచ్ నిక్ పొథాస్ అసహనం వ్యక్తం చేశారు. విషతుల్యమైన వాతావరణంపై ఏం చెప్పినా ప్రయోజనం లేదన్నాడు. ఆడటం తప్ప చేసేదేమీ లేదని పెదవి విరిచాడు. నాలుగో రోజు మంగళవారం ఆట ముగిశాక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘మా ఆటగాళ్లు శ్వాస పీల్చడంలో ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడి క్రికెట్ సంఘం స్థానిక డాక్టర్లతో పరీక్షలు చేయిస్తే బాగుండేది’ అని అన్నారు. ఎయిమ్స్ వైద్యులు వచ్చి ఆటగాళ్లను పరీక్షించిన విషయాన్ని పొథాస్ దృష్టికి మీడియా తీసుకెళ్లింది. దీనిపై కోచ్ ‘అవును కొందరినైతే పరీక్షించారట! కానీ దానిపై (పరీక్షలపై) నాకేం తెలియదు’ అని అసహనంగా బదులిచ్చారు.
లంక ఆటగాళ్ల తీరుపై సోషల్ మీడియాలో భారత అభిమాని ఒకరు చలోక్తి విసిరాడు. ఫీల్డింగ్ సమయంలో మాస్క్‌లు కట్టుకుంటున్న లంకేయులు బ్యాటింగ్ అప్పుడు ఎందుకు ధరించడం లేదని చురక అంటించాడు.
ఇబ్బంది నిజమే...
కాలుష్యంతో ఆటగాళ్లు అసౌకర్యంగా ఉన్న సంగతి నిజమేనని ఢిల్లీకి చెందిన భారత ఓపెనర్ ధావన్ అన్నాడు. కానీ ప్రొఫెషనల్ ఆటగాళ్లు ఇలాంటి కారణాలు, సాకులతో ఆడటం నుంచి తప్పించుకోరని చెప్పుకొచ్చాడు. లంక చుట్టూ బీచ్‌లే ఉండటంతో సహజంగానే అక్కడ ఈ సమస్య ఉండదని అందువల్లే వాళ్లు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారేమో అని ధావన్ తెలిపాడు.
2020 వరకు ఇక్కడ మ్యాచ్‌ల్లేవ్...
బీసీసీఐ రొటేషన్ పాలసీలో భాగంగా 2020 వరకు ఫిరోజ్ షా కోట్లా మైదానంలో మరో టెస్టు మ్యాచ్ జరిగే అవకాశం లేదని బోర్డు వర్గాలు తెలిపాయి. భవిష్యత్ పర్యటనల కార్యక్రమం (ఎఫ్‌టీపీ)లో భాగంగానే మ్యాచ్‌ల్లేవని... కాలుష్యం వల్ల కాదని బోర్డు అధికారి ఒకరు చెప్పారు.
కాలుష్యం దెబ్బ...
వాయు కాలుష్యం దెబ్బతో ఇరు జట్ల బౌలర్లు విలవిల్లాడారు. నాలుగో రోజు ఉదయం సెషన్ లో శ్రీలంక బౌలర్ సురంగ లక్మల్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. దీంతో ఉన్నట్లుండి మైదానంలోనే వాంతి చేసుకున్నాడు. చివరి సెషన్‌లో లంక బ్యాటింగ్ సమయంలో బౌలింగ్‌కు దిగిన భారత బౌలర్ షమీ కూడా శ్వాస సమస్యతోనే వాంతి చేసుకున్నాడు. అప్పటికే ఐదు బంతులు వేసి... సమరవిక్రమను అవుట్ చేసిన షమీ వాంతి చేసుకున్న తర్వాత కష్టం మీద చివరి బంతిని వేసి ఓవర్ పూర్తి చేశాడు. తర్వాత అంపైర్ అనుమతితో మైదానాన్ని వీడాడు.
Comments
Please login to add a commentAdd a comment