
భారత్ నాలుగు రోజులు ఆడుకుంది. బ్యాటింగ్‌లో నిలకడను చూపెట్టింది. బౌలింగ్‌లో వైవిధ్యాన్ని కనబరిచింది. మొత్తానికి అంతటా ఆధిపత్యాన్ని చాటింది. కానీ శ్రీలంక... ఒకే ఒక్క రోజు పోరాడింది. ఆతిథ్య జట్టు విజయాన్ని ఆఖరి పోరాటంతోఅడ్డుకుంది. చివరి రోజు భారత్ ఆశల ముంగిట పరుగుల మేడ కట్టేసింది. మూడో టెస్టుకు ‘డ్రా’ ట్విస్ట్ ఇచ్చింది.
న్యూఢిల్లీ: లంక పోరాడింది. వీరోచితంగా పోరాడింది. మూడో టెస్టును కాపాడుకుంది. ‘డ్రా’తో గట్టెక్కింది. యువ బ్యాట్స్‌మన్ ధనంజయ డిసిల్వా శతకంతో పరాజయ బాటను తుడిపేస్తే... రోషన్ సిల్వా, నిరోషన్ డిక్‌వెలా కడదాకా నిలిచి మ్యాచ్‌కు ఊహించని ఫలితాన్నిచ్చారు. నిరాశ వెంటే ఆనందమంటే ఇదేనేమో! ఈ టెస్టు ఫలితం కోహ్లి శిబిరంలో నిరాశను మిగిల్చితే... సిరీస్ విజయం ఓదార్చింది. మ్యాచ్ ముగిశాక ‘డ్రా’తో మైదానాన్ని భారంగా వీడిన భారత ఆటగాళ్లు... నిమిషాల వ్యవధిలో అదే మైదానంలో 1–0తో సిరీస్ ట్రోఫీని అందుకొని మురిసిపోయారు.
అదరగొట్టిన ధనంజయ
ఓవర్‌నైట్ స్కోరు 31/3తో చివరి రోజు ఆట కొనసాగించిన శ్రీలంక మ్యాచ్ ముగిసే సమయానికి 103 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ ధనంజయ డిసిల్వా (219 బంతుల్లో 119; 15 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో కదం తొక్కగా... మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ రోషన్ సిల్వా (154 బంతుల్లో 74 నాటౌట్; 11 ఫోర్లు), డిక్‌వెలా (72 బంతుల్లో 44 నాటౌట్; 6 ఫోర్లు) రాణించారు. ఆఖరి రోజు ఆటలో జడేజా (3/81), అశ్విన్ (1/126) కేవలం ఒక్కో వికెట్ మాత్రమే పడగొట్టగలిగారు. ఈ మ్యాచ్‌లో డబుల్ సెంచరీని... సిరీస్‌లో రెండు డబుల్ సెంచరీలు చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లికే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. మూడు టెస్టుల సిరీస్‌ను భారత్ 1–0తో కైవసం చేసుకుంది. తొలి టెస్టు కూడా ‘డ్రా’గా ముగియగా... రెండో టెస్టులో కోహ్లి సేన ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఫిరోజ్ షా కోట్లా స్టేడియం భారత స్పిన్నర్లకు స్వర్గధామం. ఒక్కడే (కుంబ్లే) ఒక ఇన్నింగ్స్‌లోనే పది వికెట్లు తీసిన పిచ్‌పై భారత్ భంగపడటం నిజంగా వైఫల్యమే. లంక బ్యాట్స్‌మెన్ వీరోచిత పోరాటాన్ని తక్కువ చేయలేం. అలాగే భారత బలగాన్ని తక్కువ చూడలేం. కానీ చూశాం! వరుసగా తొమ్మిదో సిరీస్ విజయాన్ని 2–0తో గెలుచుకుంటామనుకుంటే 1–0తోనే తృప్తి పడ్డాం. ఐదో రోజు ఆట మొదలైన కాసేపటికే రవీంద్ర జడేజా ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ మాథ్యూస్ (1)ను రహానే క్యాచ్‌తో అవుట్ చేశాడు. దీంతో లంక పతనం ప్రారంభమైందని అంతా అనుకున్నారు. కానీ కెప్టెన్ చండిమాల్ (90 బంతుల్లో 36; 2 ఫోర్లు) అండతో ధనంజయ డిసిల్వా ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. ఇద్దరూ జాగ్రత్తగా ఆడారు. ఈ క్రమంలో డిసిల్వా 92 బంతుల్లో, 8 ఫోర్లు, 1 సిక్స్‌తో అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. జట్టు స్కోరు వందకు చేరింది. మరో వికెట్ చేజార్చుకోకుండా 119/4 స్కోరు వద్ద లంక లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.
► 9 టెస్టుల్లో భారత్‌కిది వరుసగా తొమ్మిదో సిరీస్ విజయం. గతంలో ఈ ఘనత సాధించిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల సరసన టీమిండియా నిలిచింది.
అశ్విన్‌కు ఏమైంది
కుంబ్లే తర్వాత హర్భజన్‌లో వైవిధ్యం కనిపించినప్పటికీ... అతనికంటే మిన్నగా కెప్టెన్ల విశ్వాసం పొందిన బౌలర్ అశ్విన్. సొంతగడ్డపై టెస్టుల్లో తన మార్కు స్పిన్‌తో టీమిండియా వరుస విజయాల్లో భాగమైన ఈ చెన్నై స్పిన్నర్ ఈ మ్యాచ్‌లో తేలిపోయాడు. ఏకంగా 35 ఓవర్లు వేసిన అశ్విన్ 126 పరుగులు సమర్పించుకొని ఒక వికెటే తీశాడు.
లంక పాలిట ఆపద్బాంధవులు
రెండో సెషన్‌లోనూ ధనంజయ, చండిమాల్ ఒత్తిడి దరిచేరకుండా ఆడారు. ఈ జోడీని విడగొట్టేందుకు కోహ్లి స్పిన్నర్లను అదేపనిగా పురమాయించాడు. ఎట్టకేలకు అశ్విన్... కెప్టెన్ చండిమాల్‌ను బౌల్డ్ చేయడంతో లంక ఐదో వికెట్‌ను 147 పరుగుల వద్ద కోల్పోయింది. క్రీజులో పాతుకుపోయిన ధనంజయకు రోషన్ జతయ్యాడు. వీళ్లిద్దరు లంక పాలిట ఆపద్బాంధవులయ్యారు. ఎక్కడా ఏకాగ్రత కోల్పోకుండా జాగ్రత్త పడ్డారు. ఈ దశలో డిసిల్వా 188 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్‌తో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అనంతరం కండరాల నొప్పి తో అసౌకర్యంగా కనిపించిన అతను జట్టు స్కోరు 200 దాటాక రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన డిక్‌వెలా కూడా ఓ పట్టాన భారత బౌలర్లకు లొంగకపోవడంతో కోహ్లి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. 226/5 స్కోరు వద్ద రెండో సెషన్ ముగిసింది. మూడో సెషన్ కూడా కలిసిరాకపోవడంతో భారత బౌలర్లకు కష్టాలు తప్పలేదు. రోషన్, డిక్‌వెలా అర్ధ సెంచరీలు పూర్తి చేసుకొని మ్యాచ్ ముగిసే సమయానికి ఆరో వికెట్‌కు 94 పరుగులు జోడించారు.
Comments
Please login to add a commentAdd a comment