
సూపర్.. శ్రీకాంత్
భారత బ్యాడ్మింటన్ చరిత్రలో గుంటూరు వైభవాన్ని చాటాడు కిడాంబి శ్రీకాంత్. ప్రతిష్టాత్మక ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నీలో చాంపియన్‌గా నిలిచాడు. సైనా నెహ్వాల్ తరువాత అంతటి ఘనత సాధించిన తొలి భారత పురుషుడిగా నిలవడంతో పాటు గుంటూరు క్రీడా చరిత్రలో కీలక భాగమయ్యాడు.
గుంటూరు స్పోర్ట్స్ : గుంటూరు కీర్తిబావుటా మరోమారు దేశం నలుదిశలా ఎగిరింది. నగరానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ ఇండోనేషియా సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టైటిల్ సొంతం చేసుకుని ప్రతిభ చాటాడు. వరుస విజయాలు నమోదు చేస్తూ మనదేశ కీర్తి ప్రతిష్టను పెంపొందిస్తున్న షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ గుంటూరువాసి కావడం విశేషం. శ్రీకాంత్ తల్లిదండ్రులు వీఎస్ కృష్ణ, రాధాముకుంద నగరంలోని బృందావన్ గార్డెన్స్‌లో నివాసం ఉంటున్నారు.
1993, ఫిబ్రవరి 7న జన్మించిన శ్రీకాంత్ తన 9వ ఏట బ్యాడ్మింటన్‌లో శిక్షణ పొందడం ప్రారంభించాడు. స్థానిక ఎన్టీఆర్ స్డేడియంలో ఏడాది పాటు శిక్షణ పొందిన శ్రీకాంత్ 2003 నుంచి మూడేళ్లపాటు విశాఖపట్నంలో శిక్షణ పొందాడు. 2009 నుంచి హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో సాధన కొనసాగిస్తూ పలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై విజయపరంపరను కొనసాగిస్తున్నాడు.
ప్రతిభకు తార్కాణం
2012లో మాల్దీవులలో జరిగిన ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నమెంట్‌లో టైటిల్ సాధించి తన విజయపరంపరకు శ్రీకారం చుట్టాడు శ్రీకాంత్. 2013లో థాయ్‌లాండ్‌లో జరిగిన థాయ్‌లాండ్ గ్రాండ్ ఫ్రీ గోల్డ్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచాడు. 2014లో చైనాలో జరిగిన చైనా ఓపెన్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడిని చిత్తుచేసి సత్తా చాటాడు. 2015లో ఇండియా ఓపెన్ సిరీస్‌లో విజేతగా నిలిచాడు. 2017లో ఇండోనేషియాలో జరిగిన ఇండోనేషియా సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఫైనల్స్‌లో జపాన్‌కు చెందిన సకాయ్‌ను 21–11, 21–19 స్కోర్‌తో ఓడించి టైటిల్ సాధించాడు.
విద్యార్థులకు స్ఫూర్తి
పుల్లెల గోపీచంద్ ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ టోర్నీ చాంపియన్‌గా నిలిచినప్పుడు మన దేశంలో షటిల్ బ్యాడ్మింటన్‌కు ఒక్కసారిగా మంచి గుర్తింపు వచ్చింది. మన రాష్ట్రంలో ఎంతోమంది తల్లిదండ్రులు గోపిని ఆదర్శంగా తీసుకుని తమ పిల్లలకు రాకెట్లు కొనిపెట్టారు. బాడ్మింటన్ శిక్షణకు పంపారు. ఆ సమయంలో అనేక మంది పిల్లలు రాకెట్ పట్టుకుని కనిపించేవారు. ఇప్పుడు శ్రీకాంత్ సాధించిన విజయం కూడా అదే తరహాలో విద్యార్థులు, యువతలో స్ఫూర్తి నింపుతోంది. అతడ్ని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు సాధన చేసే అవకాశం ఉంది. తద్వారా గుంటూరు, కృష్ణాజిల్లాల నుంచి దేశం గర్వించదగిన క్రీడాకారులు వస్తారని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు.
ఆనందంగా ఉంది
మా అబ్బాయి శ్రీకాంత్ మరో సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టైటిల్ సాధించడం ఆనందంగా ఉంది. తనదైన శైలిలో రాణిస్తూ మరిన్ని అద్భుత విజయాలు సాధించాలి. దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి. – కిడాంబి కృష్ణ, శ్రీకాంత్ తండ్రి