కోహ్లి మారలేడా!
లక్ష్యం ఎంతున్నా కోహ్లి జట్టులో ఉన్నాడంటే భారత్‌కు ఎప్పుడైనా గెలుపుపై భరోసా ఉంటుంది. తను 19 సెంచరీలు చేస్తే 17 సార్లు భారత్ గెలిచింది. అలాంటి కోహ్లి బ్యాట్ ఇప్పుడు మొండికేస్తోంది. ఒక్కో పరుగు కోసం ఈ నంబర్‌వన్ బ్యాట్స్‌మన్ తంటాలు పడుతున్నాడు. ఆ ప్రభావం జట్టుపై కూడా పడుతోంది. అన్నింటికి మించి అతను అవుటవుతున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇన్నాళ్లుగా విజయానికి చిరునామాగా మారిన విరాట్ పదే పదే అవే తప్పులతో పెవిలియన్ చేరుతున్నాడు. మరి దీనికి పరిష్కారం లేదా!
* పదే పదే అవే తప్పులు
* వరుసగా విఫలమవుతున్న స్టార్ బ్యాట్స్‌మన్
* ఏడు నెలల పాటు అర్ధ సెంచరీ లేదు
* సాంకేతిక సమస్యతో ఇబ్బందులు
సాక్షి క్రీడా విభాగం: ఇంగ్లండ్ సిరీస్‌లో కోహ్లి అవుటైన దృశ్యాలు చూస్తే అవి ఏ మ్యాచ్‌వో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే అచ్చుగుద్దినట్లు అవన్నీ ఒకలాగే కనిపిస్తాయి. ఆఫ్‌స్టంప్‌పై వచ్చిన బంతిని శరీరానికి దూరంగా బ్యాట్ ఉంచి ఆడబోయి స్లిప్స్‌లో క్యాచ్ ఇచ్చిన రీప్లేలు లెక్కలేనన్ని సార్లు వచ్చాయి. ఇంగ్లండ్ పరిస్థితుల్లో స్వింగ్ అయ్యే బంతి కాబట్టి అలా జరిగిందేమో అనుకోవచ్చు. కానీ భారత గడ్డపై కూడా అదే తరహాలో అవుటైతే ఏమనాలి. వెస్టిండీస్‌తో తొలి వన్డేలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌పై కోహ్లి సెంచరీ చేశాడు. ఆ తర్వాత ఏడు నెలల్లో ఏడు ఇన్నింగ్స్‌లలో అతను ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేకపోయాడు. 2009నుంచి భారత జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా మారాక కోహ్లి ఇంత పేలవంగా ఎప్పుడూ ఆడలేదు. 139 వన్డేల తర్వాత కూడా అతను ఇప్పటికీ 50 సగటు కొనసాగిస్తున్నాడు. అయితే తాజా ప్రదర్శన మాత్రం ఆందోళన రేకెత్తిస్తోంది.
టెక్నిక్ సమస్య
ఇంగ్లండ్‌లో వైఫల్యం తర్వాత కోహ్లి... సచిన్ టెండూల్కర్‌ను కలిసి సలహాలు తీసుకున్నాడు. ఆ తర్వాత జాతీయ క్రికెట్ అకాడమీలోనూ తీవ్ర సాధన చేశాడు. కానీ అండర్సన్ బదులు టేలర్ బౌలింగ్‌లో అవుట్ కావడం మినహా కోహ్లి ఆటలో వచ్చిన మార్పేమిటో కొచ్చిలో మాత్రం కనిపించలేదు. అదే షాట్... అదే స్లిప్... అదే తరహాలో అవుట్! ‘కోహ్లి సమస్య మానసికమైంది కాదు. అది టెక్నికల్ లోపంగా చెప్పవచ్చు. అతను బ్యాట్ పట్టుకునే యాంగిల్ కారణంగానే ఒకే తరహాలో అవుటవుతున్నాడు. దీనిని కోహ్లి స్వయంగా సరిదిద్దుకోవాలి’ అని తొలి వన్డే అనంతరం మాజీ ఆటగాడు మైకేల్ హోల్డింగ్ విశ్లేషించారు. దీనిని దృష్టిలో ఉంచుకొని కోహ్లి మళ్లీ ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది.
స్థానం మారతాడా!
మరో వైపు బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పు కోహ్లి సమస్యను దూరం చేయవచ్చని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయ పడ్డారు. ఆఫ్‌స్టంప్‌పై పడి బయటికి వెళుతున్న కొత్త బంతులతోనే విరాట్‌కు సమస్య వస్తోందని, మిడిలార్డర్‌లో ఆడితే ఆ ఇబ్బంది తప్పుతుందని ఆయన అన్నారు. ‘వరుసగా సెంచరీలు కొట్టిన ఆటగాడు ఇప్పుడు 10-20 పరుగులు చేయలేకపోవడం ఆందోళన కలిగించే విషయమే. కొత్త బంతితో అతని లోపాలు మరీ బయట పడిపోతున్నాయి. కాబట్టి కొన్ని మ్యాచ్‌లు అతను ఐదో స్థానంలో బరిలోకి దిగితే బాగుంటుంది. అప్పుడు పరుగులు చేయడంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది’ అని సన్నీ వ్యాఖ్యానించారు.
డెరైక్టర్ ఏం చేయబోతున్నారు?
వెస్టిండీస్‌తో సిరీస్‌లో కూడా కోహ్లి విఫలమైనా ఇప్పటికిప్పుడు జట్టుకు వచ్చిన సమస్య ఏమీ లేదు. జట్టులో అతని స్థానానికీ ఢోకా లేదు. అయితే దీని తర్వాత మనం ఆడబోయేది ఆస్ట్రేలియా గడ్డపైనే. ముక్కోణపు సిరీస్‌తో పాటు ఆ తర్వాత ప్రపంచకప్‌కు సన్నద్ధం కావాల్సి ఉంది. ఆలోగా కోహ్లి ఈ లోపాన్ని అధిగమించాలి. అందుకు మిగిలిన నాలుగు వన్డే మ్యాచ్‌లను ఉపయోగించుకోవాలి. లేదంటే ఇంగ్లండ్ తరహా వికెట్లను పోలి ఉండే ఆస్ట్రేలియాలో కూడా ఇదే సమస్య కొనసాగుతుంది. అప్పుడు మార్పులు చేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి కూడా సమయం ఉండదు. ఇంగ్లండ్‌లో వన్డే సిరీస్ సమయంలో రైనా, రహానే, ధావన్...ఇలా ఎవరు బాగా ఆడినా తమ సక్సెస్‌నంతా టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రికి ఆపాదించారు. మరి శాస్త్రి... కోహ్లి విషయంలో ఏమీ చేయలేదా! భారత్ ప్రపంచ కప్ విజయావకాశాల్లో కోహ్లి ఎంత కీలకమో చెప్పనవసరం లేదు. అలాంటప్పుడు ఇప్పుడైనా కోహ్లి సమస్యను చక్కబెట్టేందుకు శాస్త్రి దృష్టి పెట్టాలేమో.
కొత్త బంతితో కోహ్లి లోపాలు మరీ బయట పడిపోతున్నాయి. కాబట్టి కొన్ని మ్యాచ్‌లు అతను ఐదో స్థానంలో బరిలోకి దిగితే బాగుంటుంది. అప్పుడు పరుగులు చేయడంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది’ - గవాస్కర్